దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి: సీపీ సీవీ ఆనంద్

- July 09, 2025 , by Maagulf
దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి. పురాతన కట్టడాలు ఎక్కడున్నా వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. దీనిని అక్షరాలా అమలు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ).. సీవీ ఆనంద్. ఆయన కృషి, పట్టుదలతో హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న పురానీ హవేలీ లోని పాత కొత్వాల్ కార్యాలయానికి మునుపటి శోభ తీసుకొచ్చారు. ఆ పురాతన భవంతికి పూర్తి స్థాయి మరమ్మత్తులు చేయించి, కొత్త సొబగులద్ది, మళ్లీ ఆ మహల్‌ను భావితరాల ముందుంచారు.

ఇవాళ పురానీ హవేలీలో సరికొత్తగా కొత్వాల్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'ఎక్స్' లో ఒక పోస్ట్ చేశారు. ' ఈ రోజు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు. పురానీ హవేలీలోని పాత కొత్వాల్ కార్యాలయం పున:ప్రారంభోత్సవం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల క్రితం, ఈ భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో ఆ పురాతన భవంతని కూల్చివేయాలనే నిర్ణయానికి వచ్చారు. కానీ మన వారసత్వాన్ని నాశనం చేయాలనే ఆలోచన నాకు నచ్చలేదు. దీనికి ఎలాగైనా పూర్వ వైభవం తీసుకురావాలన్న తలంపుతో స్పాన్సర్ కోసం వెతికాను. గ్రీన్కో సంస్థ సీఎండీ అనిల్ ఈ పునరుద్ధరణకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అంతే, ఈ భవంతి మరమ్మత్తు పని డిసెంబర్ 2022లో ప్రారంభమైంది. కానీ 2023 అక్టోబర్‌లో నా బదిలీతో, అది ఆగిపోయింది. తరువాత సెప్టెంబర్ 2024లో, నేను CP(కమిషనర్ ఆఫ్ పోలీస్)గా తిరిగి పోస్ట్ చేయబడినప్పుడు, నేను పనిని తిరిగి ప్రారంభించాను.హెరిటేజ్ సైట్ పునరుద్ధరణ అనేది ఒక శ్రమతో కూడిన ప్రక్రియ. ఎంతో ఓపికపట్టాలి. దక్కన్ టెర్రైన్ ఏజెన్సీలకు చెందిన మీర్ ఖాన్ ఎంతో ప్రశంసనీయమైన పని చేయడంతో మేము దానిని తిరిగి ప్రారంభించబోతున్నాము. ఇప్పటి నుండి కోత్వాల్ పాత నగరాన్ని సందర్శించినప్పుడు కూర్చోవడానికి ఒక స్థలం ఉంటుంది!' అని ఆనంద్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com