ఒమన్ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన యూఏఈ పౌరులు..!!

- July 15, 2025 , by Maagulf
ఒమన్ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన యూఏఈ పౌరులు..!!

యూఏఈః ఒమన్‌లో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఎమిరాటీలను గుర్తించారు. ఫుజైరాలో పోలీసు అధికారి రషీద్ గరీబ్ అల్ యమహి, అతని భార్య జవహెర్ మొహమ్మద్ అల్ యమహి,  అతని అత్త ఖాదీజా అలీ అల్ యమహి గా గుర్తించారు.  25 ఏళ్ల రషీద్ ఫుజైరా పోలీసులలో కరెక్షనల్,  శిక్షాత్మక సంస్థలో ఫస్ట్ కార్పోరల్‌గా పనిస్తున్నారు. అతని భార్య జవహర్ వయసు 21, ఆమె తల్లి ఖదీజా వయసు 51 అని అధికారులు తెలిపారు. కాగా, వారి ఎనిమిది నెలల కుమార్తె ఒమన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతర కుటుంబ సభ్యులు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫుజైరాలోని షేక్ ఖలీఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో  అలీ అల్ యమహి, అతని భార్య షైఖా అల్ సరీది,  వారి పిల్లలు దలాల్ (4), మొహమ్మద్ (7), ఖదీజా (1), అలాగే అలీ తోబుట్టువులు సబిహా (15), హమద్ (18) ఉన్నారు.
ఒమన్‌లోని ధోఫర్‌లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేసవి సెలవుల కోసం కుటుంబం సలాలాకు వెళుతుండగా.. ఈ విషాదకర ప్రమాదం జరిగింది. ఒమన్ నుండి వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత శనివారం ఫుజైరాలో ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఒమన్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు ఢీకొన్నాయి.  ఇద్దరు ఒమానీలు,  ముగ్గురు ఎమిరాటీలు సహా ఐదుగురు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. వారిలో తొమ్మిది మంది ఎమిరాటీలు ఉండగా, ఐదుగురు పిల్లలు ఉన్నారు. గాయపడ్డ ఎమిరాటీలను మెరుగైన వైద్యం కోసం ఒమన్‌ ప్రత్యేక విమానంలో యూఏఈకి  తరలించారు.ఈ సందర్భంగా యూఏఈ పౌరులు రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ చట్టాలు, వేగ పరిమితులను పాటించాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com