ప్రజా రాజకీయ దిగ్గజం-దామచర్ల ఆంజనేయులు
- July 15, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించిన నేతల్లో దామచర్ల ఆంజనేయులు ఒకరు. ప్రజా సేవకే పదవులు అని నమ్మి చేపట్టిన ప్రతి పదవిని సమర్థవంతంగా నిర్వర్తించారు. ఉద్దండులకు, హేమా హేమీలకు నిలయమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు. తెదేపా ఆవిర్భావం నుంచి జిల్లాలో పసుపు జెండాను రెపరెపలాడించడానికి చేసిన కృషి, శ్రమ మరువలేనిది. ఎమ్యెల్యేగా... జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా... మంత్రిగా జిల్లాను ప్రగతి పథంలో నిలబెట్టారు. పార్టీలకు అతీతంగా అందరితో ఆప్యాయంగా మెలుగుతూ "పెద్దయన"గా పిలిపించుకున్న రాజకీయ దిగ్గజం స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
దామచర్ల ఆంజనేయులు 1930, జూలై 15న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త నెల్లూరు జిల్లాలోని టంగుటూరు తాలూకా తూర్పు నాయుడు పాలెం గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక దశలోనే చదువుకు ముగింపు పలికి తండ్రికి చేదోడు వాదోడుగా వ్యవసాయంలో స్థిరపడ్డారు. పొగాకు వ్యవసాయదారుడిగా జీవితాన్ని మొదలుపెట్టి స్వశక్తి, పట్టుదల మరియు దీక్షా, దక్షతలతో పొగాకు వ్యాపారిగా మారారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ పొగాకు ఎగుమతిదారుగా ఎదిగి దేశవిదేశాలకు పొగాకు ఎగుమతి చేశారు. పొగాకు వ్యాపార రంగంతో పాటుగా గిడ్డంగుల నిర్మాణం మరియు ఇతరత్రా వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించారు.
వ్యాపారంలో బిజీగా ఉన్న దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దామచర్ల తొలుత తూర్పు నాయుడుపాలెం గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1962-72 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ప్రకాశం జిల్లా తోలి జిల్లా పరిషత్ ఛైర్మన్ పోతుల చెంచయ్య, మాజీ మంత్రి నల్లమోతు చెంచు రామానాయుడు, మాజీ ఎమ్యెల్యేలు చాగంటి రోశయ్య నాయుడు, గుండపనేని పట్టాభి రామయ్య చౌదరి గార్లతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరిన ఈయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున కొండపి నుంచి పోటీ చేయాలని భావించినా, కొన్ని కారణాల దృష్ట్యా పార్టీ వేరే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడంతో కొంత అసంతృప్తి ఉన్నా, ఎన్టీఆర్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థిని గెలిపించారు. 1983- 88 వరకు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశారు.
జిల్లా పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉంటూ అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడైన ఇరిగినేని తిరుపతి నాయుడు, గొట్టిపాటి హనుమంతరావు మరియు దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో కలిసి పనిచేశారు. తర్వాత కాలంలో తిరుపతి నాయుడు, గొట్టిపాటి హనుమంతరావులు పార్టీని వీడినా తానూ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పార్టీ పగ్గాలను చేపట్టి, పార్టీ పటిష్టత కోసం నిర్విరామంగా పనిచేశారు. 1991 లోక్ సభ ఎన్నికల్లో పర్చూరు సిట్టింగ్ ఎమ్యెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల ఎంపీగా ఎన్నికవ్వడంతో వచ్చిన ఉపఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాదె వెంకట్ రెడ్డి చేతిలో ఓడారు. ఆ ఓటమి తర్వాత తన సొంత స్థానమైన కొండపికి మారారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా కొండపి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయడమే కాకుండా, నాయకులు & కార్యకర్తల మధ్య సమన్వయం తీసుకొచ్చారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్యెల్యే గుండపనేని అచ్యుత్ కుమార్ మీద ఘనవిజయం సాధించారు. 1995లో కొన్ని అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు పక్షంలో నిలిచారు. 1997లో ప్రకాశం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గొట్టిపాటి హనుమంతరావు ఆకస్మిక మరణంతో ఏర్పడ్డ మంత్రివర్గ ఖాళీని సీనియర్ నాయకుడైన ఆంజనేయులు గారితో పూరించరించడం జరిగింది. అలా 1997-99 మధ్య చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నుంచి దామచర్ల రెండోసారి విజయం సాధించారు. ఆ సమయాన రాజకీయ సమీకరణాల వల్ల తోలి దశలో మంత్రివర్గంలో చోటు లభించలేదు. అయితే, 2001లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మార్కెటింగ్ & గిడ్డంగుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు పనిచేశారు. మంత్రిగా తీరకలేని సమావేశాలు, విస్తృతమైన పర్యటనల వల్ల నియోజకవర్గ కార్యకర్తలతో గ్యాప్ రావడం, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్యన మనస్పర్థలు, కొట్లాటలు, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బలమైన నేపథ్యం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయడంతో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నుంచి ఓటమి చెందారు.
దామచర్ల ఆంజనేయులు అభివృద్ధి కాముకులు మరియు గొప్ప పరిపాలనావేత్త. జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దిగిపోయే వరకు బ్యాంకును నష్టాల ఊబి నుంచి లాభాల బాటలో పట్టించారు. అంతేకాకుండా, తన హయాంలోనే రైతులకు అత్యధిక రుణాలను మంజూరు చేయించారు. బ్యాంకు శాఖలను జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. ఎమ్యెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో కొండపిలోని ప్రతి గ్రామానికి రోడ్లు, రక్షిత మంచినీటి స్కీముల ద్వారా నీటి సరఫరా, స్కూల్ భవనాల నిర్మాణం, నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో తుపాను సహాయ కేంద్ర భవనాల నిర్మాణం, కల్వర్టులు, మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణం, జన్మభూమి కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధి మరియు పలు కార్యక్రమాలు చేపట్టారు. మంత్రిగా జిల్లా అంభివృద్ధికి సైతం శక్తివంచన లేకుండా పాటుపడ్డారు.
దామచర్ల గొప్ప ఉదాత్తత స్వభావం గల వ్యక్తి. తనతో పాటుగా పది మంది బాగుండాలి అనే మనస్తత్వం ఉండటం చేత, వ్యాపారవేత్తగా రాణిస్తున్న సమయంలోనే ఎందరికో వ్యాపార రంగంలో పైకి వచ్చేందుకు తన వంతైన సహాయ, సహకారాలను అందించారు. అలాగే, ఎందరో విద్యావంతులకు తమ కంపెనీల్లో ఉపాధిని కల్పించారు. విద్య ప్రాముఖ్యత తెలిసినవారు కావడంతో ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉన్న చదువులు చదివేందుకు ఆర్థిక సహకారం, ఉపకరవేతనాలు అందించారు. అలాగే, ధార్మిక కార్యక్రమాలకు సైతం భూరిగా విరాళాలు ఇచ్చేవారు.
రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికి చివరి వరకు ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించిన వ్యక్తిగా దామచర్ల ఆంజనేయులు చరిత్రలో నిలిచిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు అధికార దర్ప ప్రదర్శనలతో ఉదరగొట్టే వంటి సంప్రదాయాలకు భిన్నంగా కొండపి నియోజకవర్గ పర్యటన సమయంలో తన సొంత జీపులోనే ప్రతి గ్రామం తిరుగుతూ పార్టీ కార్యకర్తలకు, ప్రజలను పేరు పేరున ఎంతో ఆత్మీయంగా పలకరించుకుంటూ వెళ్లేవారు. ముఖ్యంగా తనతో రాజకీయంగా నడిచే కార్యకర్తలు అంటే ప్రాణం ఇచ్చేవారు, వారి పిల్లల చదువులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ తన కుటుంబ సభ్యులుగా పరిగణించేవారు. ప్రత్యర్థులు సైతం ఆయన పట్ల గౌరవభావంతో మెలిగివారు.
మూడున్నర దశాబ్ద రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. వ్యాపారాల్లో మరింత ఉన్నత స్థాయిని అందుకునే అవకాశాలు ఉన్నప్పటికి, ఆ సమయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు వినియోగించారు. తన చివరి శ్వాస వరకు పార్టీయే లోకంగా బతికారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రోజు నుంచే జిల్లా పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు. 2006 మధ్య నాటికి అనారోగ్యం కృంగదీయడం మొదలుపెట్టినా, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న సమయంలోనే 2007,సెప్టెంబర్ 22న గుండెపోటుతో తన 78వ ఏట కన్నుమూశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తన అకుంటిత పరిశ్రమతో, వ్యవహార దక్షతతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా నిలిచిపోయారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!