ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్ కేంద్రానికి తిరుమలలో భూమిపూజ

- July 17, 2025 , by Maagulf
ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్ కేంద్రానికి తిరుమలలో భూమిపూజ

తిరుమల: టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు భూమిపూజ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని,ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ-ఐఓసీఎల్ ఒప్పందం కుదిరిందని తెలిపారు. 

రూ.8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను టీటీడీ-ఐఓసీఎల్ సంయుక్తంగా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.ఈ గ్యాస్‌ను లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి రూ.1.5 కోట్ల ఆదా జరుగుతుందని పేర్కొన్నారు.

ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి.సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద రూ.12.05 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతి రోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు 1000 కేజీల బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు.

ఈ ప్లాంట్‌లో 45 మెట్రిక్ టన్నుల మౌండెడ్ స్టోరేజ్ వెసల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్ లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్‌, ఐఎల్‌ఎస్‌డీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్య నారాయణ,ఈఈలు సుబ్రహ్మణ్యం సుధాకర్, డీఈ  చంద్రశేఖర్, ఇతర టీటీడీ, ఐఓసీఎల్ అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com