మరాఠా ఉద్దండ రాజకీయవేత్త-శంకర్ రావ్ చవాన్

- July 21, 2025 , by Maagulf
మరాఠా ఉద్దండ రాజకీయవేత్త-శంకర్ రావ్ చవాన్

శంకర్ రావ్ చవాన్... మరాఠా రాజకీయాల్లో అత్యున్నత స్థానాలను అందుకున్న నాయకుల్లో ఒకరు. స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొంటూనే నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. యశ్వంత్ రావ్ చవాన్, వసంత్ రావ్ నాయక్ వంటి ఉద్దండుల సహచర్యంలో మహారాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్రవేశారు. ఇందిరా నుంచి సోనియా వరకు నెహ్రూ - గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగారు. మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర రక్షణ, మానవవనరులు, ఆర్థిక, హోం శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. నేడు మరాఠా ఉద్దండ రాజకీయవేత్త శంకర్ రావ్ చవాన్ మీద ప్రత్యేక కథనం...  

శంకర్ రావ్ చవాన్ పూర్తిపేరు శంకర్‌ రావ్ భవ్‌రావ్ చవాన్. 1920, జూలై 14న అవిభక్త హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఔరంగాబాద్ జిల్లా పైఠాన్  గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు.ఔరంగాబాద్, హైదరాబాద్ పట్టణాల్లో ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత మద్రాస్ వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. కొంతకాలం ఔరంగాబాద్ పట్టణంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

చవాన్ చిన్నతనం నుంచే నిజాం పాలన పట్ల వ్యతిరేక భావాలను కలిగి ఉండేవారు. మద్రాస్ నగరంలో చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆసక్తి పెంచుకొని, అందులో చేరారు. ఆ తర్వాత ఉస్మానియాలో చేరిన తర్వాత నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. సురవరం ప్రతాప రెడ్డి, స్వామి రామతీర్థ వంటి వారు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించేందుకు సమాయత్తం అవుతున్న దశలోనే వారితో కలిసి పనిచేశారు. 1942లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్న దశలోనే స్వామి రామానంద తీర్థ ద్వారా పివి నరసింహారావు పరిచయం అయ్యారు. రామానంద ఆదేశాల మేరకు ఔరంగాబాద్ కేంద్రంగా మరాఠ్వాడాలో నిజాం వ్యతిరేక పోరాటంలో నాయకత్వం వహించారు. ఒకవైపు నిజాం పోరాటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను సాగించారు.

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరాఠ్వాడా ప్రాంతాన్ని బొంబాయి రాష్ట్రంలో కలపాలని కోరుతూ జరిగిన ఉద్యమానికి పలువురు దిగ్గజ గాంధేయవాద కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేసే బాధ్యతను దిగ్విజయంగా నిర్వహించారు. 1948లో బొంబాయి రాష్ట్రంలో మరాఠ్వాడా ప్రాంతం కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. చవాన్ 1952 బొంబాయి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ టిక్కెట్ దక్కడం వల్ల సోషలిస్టు పార్టీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. యాదృచ్చికంగా ఆయన మిత్రుడు పివి నరసింహారావు సైతం హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి చేతిలో ఓడారు. అలా ఓటమితో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం క్రమంగా పుంజుకుంది.

మరాఠా రాజకీయ భీష్ముడు యశ్వంత్ రావ్ చవాన్ అనుచరుడైన కేశవ్ రావ్ సోన్వానే శిష్యరికంలో రాటుదేలారు. సోన్వానే మద్దతుతో 1956లో బొంబాయి రాష్ట్ర శాసనమండలికి ఎన్నికైన చవాన్, 1957 ఎన్నికల్లో నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ నుంచి తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1958లో రాష్ట్ర రెవెన్యూ శాఖ  సహాయ మంత్రిగా 1960 వరకు పనిచేశారు. 1960-62 వరకు ఇరిగేషన్, విద్యుత్, ఆహార మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

1962 ఎన్నికల్లో ధర్మాబాద్ నుంచి రెండోసారి ఎన్నికైన తర్వాత యశ్వంత్ రావ్ చవాన్ మంత్రివర్గంలో అదే శాఖలను నవంబర్ వరకు నిర్వహించారు. చవాన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి రావడం, చవాన్ స్థానంలో మరోత్ రావ్ కన్నంవార్ సీఎం అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో సైతం ఇరిగేషన్, విద్యుత్ మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా 1962 నవంబర్ 20 నుంచి 1963 నవంబర్ 24 వరకు పనిచేశారు.

మరోత్ రావ్ ఆకస్మిక మరణంతో వసంత్ రావ్ నాయక్ సీఎం అయ్యారు. నాయక్ మంత్రివర్గంలో 1963 నుంచి 1975 వరకు ఇరిగేషన్, పవర్, రెవెన్యూ,హోమ్, సహకార, వ్యవసాయం, విద్య, పశుసంవర్థక, గ్రామీణ & పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. నాయక్ హయాంలోనే చవాన్ మరాఠ్వాడా ప్రాంతం మీద పూర్తి పట్టు సాధించారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గెలుపోటములను ప్రభావితం చేయగల బలమైన శక్తిగా ఎదిగారు. కరువు కాటకాలకు నిలయమైన మరాఠ్వాడా ప్రాంతంలో పలు భారీ, మేజర్ మరియు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రిజర్వాయర్స్ నిర్మించారు. ఇవే కాకుండా ఆ ప్రాంత రైతాంగం కోసం ఎన్నో సహకార సంస్థలను స్థాపించి వారి మద్దతును పొందారు.

వసంత్ రావ్ నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్న దశలో సీఎం పీఠం పలువురు పోటీ పడుతున్న సమయంలోనే చవాన్ అనూహ్యంగా నాయక్ స్థానంలో సీఎం అయ్యారు. 1975-77 వరకు మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే  ఎమెర్జెన్సీ నడవడం, ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కారణంగా చవాన్ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. పార్టీలో కూడా చవాన్ నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం కావడం, 1977 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలు కావడం వల్ల, అయన స్థానంలో వసంత్ దాదా పాటిల్ సీఎం అయ్యారు.

1978లో కాంగ్రెస్ చీలిన సమయంలో చవాన్ స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నిక కావడమే లేకుండా, తనతో పాటు పలువురిని స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకున్నారు. కాంగ్రెస్ సమాజ్‌వాదీ ప్రతిష్ఠాన్ పేరుతో వారందరికీ నాయకత్వం వహించారు. ఆ ఎన్నికల్లో జనతాపార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకున్నా అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ లేకపోవడం, కాంగ్రెస్ చీలిక పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చవాన్ సైతం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే, కాంగ్రెస్ (ఆర్స్) నాయకుడైన శరద్ పవార్ ప్రభుత్వాన్ని పడగొట్టి జనతా పార్టీ, ఇతరులతో కలిసి పిడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో చవాన్ సైతం తన వారితో కలిసి పవార్ పక్షాన చేరారు. 1978-80 వరకు పవార్ కోరిక మేరకు ఆయన మంత్రివర్గంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు.

1980లో సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీల ఆహ్వానం మేరకు తిరిగి ఆమె నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ (ఐ)లో చేరారు. 1980 లోక్ సభ ఎన్నికల్లో నాందేడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో 1980-81 వరకు కేంద్ర మానవ వనరులు, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత యశ్వంత్ చవాన్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక పదవిని 1981 నుంచి 1984 వరకు నిర్వహించారు. ఇందిరా ఆకస్మిక మరణం తర్వాత రాజీవ్ నాయకత్వంలో 1984 లోక్ సభ ఎన్నికలకు వెళ్లగా చవాన్ మళ్ళీ నాందేడ్ నుంచి రెండోసారి ఎంపీ అయ్యారు. 1984-89 వరకు రాజీవ్ మంత్రివర్గంలో రక్షణ, హోమ్ మరియు ఫైనాన్స్ మంత్రిగా పనిచేశారు. 1986లో రాజీవ్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టి 1987 వరకు పనిచేశారు.

1987లో శరద్ పవార్‌ను  పార్టీలోకి తీసుకొచ్చిన రాజీవ్, చవాన్ స్థానంలో సీఎంను చేశారు. తనకు మాటైనా చెప్పకుండా తన స్థానంలో పవార్ సీఎంను చేయడంతో కొంత నొచ్చుకున్నా, తన మిత్రుడైన పివి సర్దిచెప్పడంతో మాములు అయ్యారు. 1988లో రాజ్యసభకు ఎన్నికైన చవాన్, 1990లో రెండోసారి ఎన్నికయ్యారు. 1991-96 వరకు రాజ్యసభ పక్షనేతగా వ్యవహరించారు. 1991లో మిత్రుడు పివి ప్రధాని కావడంతో ఆయన హోమ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1996 వరకు కొనసాగారు. 1996లో మూడోసారి రాజ్యసభను ఎన్నికై 2002 వరకు కొనసాగారు. 1996 నుంచి 2002 మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

చవాన్ రాజకీయాల్లో ఎందరినో పైకి తీసుకొచ్చి ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రులు మరియు సీఎంలను చేశారు. తన సన్నిహిత మిత్రుడైన వసంత్ రావ్ నాయక్ తమ్ముడి కుమారుడైన సుధాకర్ రావ్ నాయక్, తన ప్రియ శిష్యుడైన విలాస్ రావ్ దేశముఖ్‌లను మహారాష్ట్రకు సీఎంలను చేయగా, శివరాజ్ పాటిల్‌ను కేంద్ర మంత్రిగా, లోక్ సభ స్పీకర్‌ను చేశారు. చవాన్ తయారు చేసిన వారందరూ ఇప్పటికి ఆయా జిల్లాల్లో బలీయమైన రాజకీయ శక్తులుగా ఉన్నారు. చవాన్ విధానాన్నే పవార్ పాటించి పలువురు శక్తివంతులైన రాజకీయ నాయకులను తయారు చేశారు.

చవాన్ నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల్లో పలు సహకార సంస్థలు, విద్యాసంస్థలు స్థాపించారు. వీటిని మరాఠా మిత్ర మండలి సంస్థ పేరిట నిర్వహిస్తూ వచ్చారు. చవాన్ స్థాపించిన సహకార మరియు విద్యా సంస్థలు ఇప్పటికి విజయవంతంగా నడుస్తూనే ఉన్నాయి.  ఈ సంస్థల కింద కొన్ని వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు చవాన్ కుటుంబమే నిర్వహణ చేస్తూ ఉంది.తన ఏకైక కుమారుడు మరియు రాజకీయ వారసుడైన అశోక్ చవాన్ రాజకీయ జీవితాన్ని సైతం ఈ సంస్థల నిర్వహణ నుంచే మొదలు పెట్టించారు. ఆ తర్వాత అశోక్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి తన తండ్రి లాగే మంత్రి, సీఎం అయ్యారు.

ఆరున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చవాన్ నెహ్రూ - గాంధీ కుటుంబానికి,తన మితుడైన పివి నరసింహారావుల పట్ల విశ్వాసంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా తన రాజకీయ ఎదుగుదలలో పివి చేసిన సాయాన్ని, ఆయన ఏనాడూ మరువలేదు. పివి ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన్ని కలుస్తూ వచ్చిన అతికొద్ది మంది నేతల్లో చవాన్ ఒకరు. పివితో సన్నహితంగా ఉంటూనే సోనియా గాంధీకి మద్దతుదారుగా నిలిచారు. మరాఠా రాజకీయాల్లో తన రాజకీయ ప్రత్యర్థి శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత పార్టీని నడిపించేందుకు పూనుకొని సోనియాకు విశ్వాసాన్ని చూరగొన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠ్వాడా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు విలాస్ రావ్ దేశముఖ్‌తో కలిసి పనిచేశారు. గొప్ప రాజకీయ నాయకుడిగానే కాకుండా, గొప్ప పరిపాలనా దక్షుడిగా సైతం గుర్తింపు సాధించిన శంకర్ రావ్ చవాన్ 2004, ఫిబ్రవరి 26న తన 83వ ఏట ముంబైలో కన్నుమూశారు.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com