మరాఠా రాజకీయవేత్త-అజిత్ పవార్
- July 23, 2025
ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అజిత్ పవార్. మరాఠా యోధుడైన శరద్ పవార్ నీడలో రాజకీయ ఓనమాలు దిద్దిన అజిత్ .. స్వల్ప కాలంలోనే తనదైన శైలిలో మరాఠా రాజకీయాల్ని అవపోసన పట్టారు. సహకార రంగం నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం దాక ఎదిగిన ఈ జూనియర్ పవార్.. రాజకీయ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు చేస్తూ పోతున్నారు. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ఆధిపత్యాన్ని తగ్గనీయకుండా చేసేందుకు తమ సొంత పార్టీని చీల్చారు. నేడు మరాఠా రాజకీయవేత్త, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీద ప్రత్యేక కథనం...
అజిత్ దాదాగా సుపరిచితులైన అజిత్ అనంతరావ్ పవార్ 1959, జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా డియోలాలీ ప్రవరా అనే చిన్న పట్టణంలో అనంతరావ్ పవార్, ఆశాలత తాయి దంపతులకు జన్మించారు. తండ్రి మరాఠా సినిమాల్లో పనిచేసేవారు. ప్రసిద్ధ దర్శక దిగ్గజం వి.శాంతారామ్ వద్ద సహాయ దర్శకుడిగా, నిర్వహక నిర్మాతగా వ్యవహరించారు. అనంతరావ్ స్వగ్రామం బారామతి దగ్గర్లోని కాటేవాడి గ్రామం అయినప్పటికి, అజిత్ అమ్మగారి ఊరైన డియోలాలీ ప్రవరాకు మకాం మార్చారు. అజిత్ బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది.
అజిత్ హైస్కూల్ విద్యకు వస్తున్న దశలోనే తండ్రి ఆకస్మిక మరణంతో డియోలాలీ ప్రవరా నుంచి కాటేవాడి గ్రామంలో ఉన్న తాతయ్య, నాయనమ్మల దగ్గరికి చేరారు. కుటుంబంలో అందరికంటే ఇష్టమైన మావాడైన అజిత్‌ను నానమ్మ శారదబాయి ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకునేవారు. తానూ చనిపోతూ అజిత్ ఆలనాపాలనా బాధ్యతను చివరి కుమారుడైన శరద్ పవార్‌కు అప్పగించారు. మరాఠా ప్రాంత రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న పవార్, అజిత్‌కు రాజకీయాలను పరిచయం చేశారు. 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత పై చదువులకు వెళ్లకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
అజిత్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి శరద్ పవార్ మహారాష్ట్రకు సీఎంగా ఉన్నారు. శరద్ సీఎం కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి అసెంబ్లీ నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలను అజిత్‌కు అప్పగించడం జరిగింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికి తన బాబాయి పవార్ మార్గదర్శనంలో నియోజకవర్గం మీద పట్టు సాధించారు. పవార్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా గడుపూతూ ఉంటె అజిత్ బారామతిని చూసుకునేవారు. ఈ క్రమంలోనే సీనియర్ పవార్ సన్నిహిత వర్గాలు, కార్యకర్తలు అజిత్‌కు దగ్గరవుతూ వచ్చారు. ఎటువంటి రాజకీయ పదవి లేకున్నా అజిత్ బారామతి ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.
1982లో బారామతి సహకార చక్కర పరిశ్రమ డైరెక్టర్ పదవిని చేపట్టిన అజిత్ అప్పటికే పూణే జిల్లా రాజకీయాల్లో బలమైన రాజకీయ యువ శక్తిగా ఎదిగారు. శరద్ పవార్ ఆదేశాల మేరకు పూణే సహకార సంస్థలను కైవసం చేసుకొని, తమ అనుచరులను పాలక వర్గాల్లో నియమిస్తూ జిల్లా సహకార సంస్థలపై పవార్ కుటుంబ పరిధిలోకి తీసుకొచ్చారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో పవార్ బారామతి నుంచి సోషలిస్టు పవార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు ఇందిరా ఆకస్మిక మరణంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి విస్తూ ఉన్న సానుభూతి పవనాలను తట్టుకొని మరీ గెలవడం వెనుక అజిత్ పాత్ర చాలా కీలకం.
అజిత్ రాజకీయ జీవితం మొదలైన నాటి నుండి 1987 వరకు శరద్ పవార్ వర్గం పేరుతోనే రాజకీయాలు నడిపారు తప్పించి ఏ పార్టీలో చేరలేదు. 1987లో రాజీవ్ ఆహ్వానం మేరకు శరద్ పవార్ 9 ఏళ్ళ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే అజిత్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శరద్ పవార్ రెండోసారి మహారాష్ట్ర సీఎం అయిన తరవాత అజిత్ పశ్చిమ మహారాష్ట్ర ప్రాంత సహకార సంస్థల మీద పట్టు సాధిస్తూ పోయారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ తొలిసారి బారామతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి సీనియర్ పవార్‌ను తన మంత్రివర్గంలో రక్షణ శాఖను చేపట్టాలని కోరడంతో అజిత్‌ను ఎంపీ పదవికి, తాను బారామతి అసెంబ్లీకి రాజీనామా చేసి ఉపఎన్నికలో అజిత్‌ను బారామతి అసెంబ్లీకి, తాను ఎంపీగా శరద్ గెలిచారు. అలా 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీకి ఎన్నికైన అజిత్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఓటమిని చవిచూడలేదు.
అజిత్ ఎమ్యెల్యేతో పాటుగా పూణే జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌గా సైతం ఎన్నికయ్యారు. ఎమ్యెల్యేగా ఎన్నికైన నాటి నుంచి పూణే జిల్లా కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించారు. పశ్చిమ మహారాష్ట్రలో అతిపెద్ద జిల్లా మరియు సంపన్న పట్టణమైన పూణే మీద పట్టు సాధించడం అజిత్ రాజకీయ జీవితంలో అతిపెద్ద మలుపు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి రెండోసారి ఎన్నికవ్వడమే కాకుండా, పూణే జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. 1999లో శరద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపిని స్థాపించినప్పటి నుంచి అజిత్ సైతం మహారాష్ట్ర రాజకీయాల్లోకి అగుడుపెట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ - ఎన్సీపి ప్రభుత్వంలో హార్టికల్చర్, ఇరిగేషన్ శాఖల మంత్రిగా 2004 వరకు పనిచేశారు.
2004-09 వరకు విలాస్ రావ్ దేశముఖ్, అశోక్ చవాన్ మంత్రివర్గాల్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, 2009-14 వరకు అశోక్ చవాన్, ప్రిథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గాల్లో ఇరిగేషన్, ఫైనాన్స్ మరియు విద్యుత్ శాఖల మంత్రిగా, 2010-14 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ - ఎన్సీపి కూటమి ఓటమి తర్వాత 2014-19 వరకు ఎన్సీపి పక్ష నేతగా వ్యవహరించినప్పుడే భాజపా ప్రభుత్వం తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధించడం పట్ల పలు నిరసన కార్యక్రమాలు ఉదృతంగా నిర్వహిస్తూ ప్రజల్లోనే గడిపారు. కాంగ్రెస్ పార్టీని వదలి తమ పక్షంలో చేరాలని భాజపా పెద్దలు శరద్ పవార్ మీద తెచ్చిన ఒత్తిడిని ఆయన తలొగ్గక పోవడంతో అజిత్ పవార్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
పార్టీకి చరిష్మా శరద్ పవార్ కావవచ్చు, పార్టీ నిర్వహణ, ఆర్థిక వనరుల సృష్టి, పార్టీ శ్రేణుల బాగోగులన్ని అజిత్ పవార్ చూసేవారు. ఈ క్రమంలోనే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వల్ల లబ్ది చేకూరిన వారందరిపై దర్యాప్తు సంస్థల దాడులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణ వ్యవయాల పునః పరిశీలన చేయడం వంటి ద్వారా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో చేసేదేమి లేక 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హంగ్ రావడంతో భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అజిత్ చర్యను తీవ్రంగా పరిగణించిన శరద్ పవార్ మొదట్లో స్పదించినా, తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని భావోద్వేగంతో అర్థించగా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అజిత్ తిరిగి శరద్ పవార్ వర్గంలోకి వచ్చారు.
2019-22 వరకు మహా వికాస్ ఆఘాడి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మరియు ఆర్థిక & విద్యుత్ శాఖల బాధ్యతలు అజిత్ పవార్ నిర్వహించారు. 2022లో దర్యాప్తు సంస్థల దాడులు, తనను కాదని శరద్ పవార్ తన కుమార్తె సుప్రియను రాజకీయంగా క్రియాశీలకం చేయడం వంటి రాజకీయ, కుటుంబ సమస్యల కారణంగా ఈసారి ఎన్సీపిని చీల్చి ఎన్డీయే కూటమిలో చేరారు. 2022-24 వరకు మహాయుతి కూటమిలో దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటుగా డిప్యూటీ సీఎం అయ్యి ఆర్థిక శాఖను నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మునపటి లాగే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యధిక సార్లు (6) డిప్యూటీ సీఎం అయిన ఘనత అజిత్ పేరిట నమోదైంది. అలాగే, వరసగా 8 సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా 15 ఏళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇలా మరాఠా రాజకీయాల్లో అజిత్ రికార్డ్స్ చాలానే ఉన్నాయి. అవినీతి వ్యవహారాల్లో అజిత్ పేరు ఎల్లప్పుడూ ముందుంటుంది. సహకార, రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణాల్లో జరిగిన కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి వ్యవహారాల్లో అజిత్ పవార్ పేరును ప్రతిపక్షాలు విమర్శనాస్త్రంగా ఇప్పటికి ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఇన్ని అవినీతి అక్రమాల్లో అజిత్ పేరు తరచూ వార్తల్లో ఉన్నప్పటికి పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో తిరుగులేని జనాదరణ పొందుతూనే ఉన్నారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో పవార్ కుటుంబ రాజకీయ ప్రయోజనాలు, తమను నమ్ముకొని ఉన్న పార్టీ శ్రేణుల కోసం అజిత్ ఎన్నో త్యాగాలు & సాహసాలు చేస్తూ, ఓర్పు మరియు సహనంతో రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని నిలబడ్డారు. తనని నమ్ముకున్న వారి ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. తన రాజకీయ గురువైన బాబాయి శరద్ పవార్‌ను విభేదించి రాజకీయాలు చేయడం సుతారం ఇష్టం లేకున్నా, పార్టీ శ్రేణుల మనోగతం మేరకు తిరుగుబాటు చేశారు. ఏది ఏమైనా పవార్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడటమే అజిత్ పవార్ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం విమర్శలు, ఛీత్కారాలు ఎదుర్కోవడానికి కూడా అజిత్ సిద్ధంగా ఉంటారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!