కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్త సూచనలు

- July 24, 2025 , by Maagulf
కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్త సూచనలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో జనం అప్రమత్తంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలన్నారు.

ప్రజా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.వర్షాలు, వరదల కారణంగా ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే సహాయం అందేలా అధికారులు ఎల్లప్పుడూ జిల్లాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షిస్తుండాలని కూడా సీఎం సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com