మాటల చక్రవర్తి-ఎం.వి.ఎస్. హరనాథరావు
- July 27, 2025
మాటలు రాయడం మాటలు కాదు. అందులోనూ ఈటెల్లా గుచ్చుకొనే సంభాషణలు, ట్రిగ్గర్ నొక్కకుండానే దూసుకుపోయే తూటాల్లాంటి మాటలు రాయడం కష్టాతికష్టం.కానీ ఆయనకి అలాంటి మాటలు రాయడమే ఇష్టం. ఆయన కలం అభ్యుదయం చిలికించింది.సభ్య సమాజాన్ని ప్రశ్నించింది.వెండితెరపై ఎర్రటి సూరీడులా ఉదయించింది. నాలుగు ఇంగ్లిషు సీడీల్ని చూస్తూ, ‘ఇక్కడో సెటైర్ పడాల్సిందే’ అంటూ కొలతలు కొలుస్తూ, ‘ఈ సినిమాకి ఇంత చాల్లే’ అని లెక్కలేసుకొంటూ ఆయనెప్పుడూ కలం పట్టలేదు. చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల మనస్తత్వాల్నీ చూసి మాటలు రాశారు, ‘లేడి పంజా’ దెబ్బ రుచి చూపించి, ‘జగన్నాథ రథ చక్రాల’ను వడివడిగా నడిపించిన నాటక రచయిత ఆయన . ‘ప్రతిఘటన’, ‘దేవాలయం’, ‘రాక్షసుడు’, ‘ఎర్ర మందారం’ లాంటి చిత్రాల్లో తూటాల్లాంటి మాటలతో రచయితగా విశ్వరూపం ప్రదర్శించారు ఎం.వి.ఎస్. హరనాథరావు. నేడు మాటల చక్రవర్తి ఎం.వి.ఎస్. హరనాథరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
ఎం.వి.ఎస్. హరనాథరావు 1948, జూలై 27న గుంటూరు పట్టణంలో రంగాచార్యులు, సత్యవతి దేవి దంపతులకు జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్యను గుంటూరులోనే సాగింది. ఒంగోలు శర్మ కళశాలలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని పలు సాహిత్య మరియు అభ్యుదయ పుస్తకాలను చదివారు.అదే సమయంలోనే నాటకాల మీద ఆసక్తి పెరగడం మూలాన తన 8వ ఏటనే నాటక రంగంలోకి అడుగుపెట్టారు. శర్మ కళాశాలలో చదువుతున్న సమయంలోనే ప్రజా నాట్య మండలి కళాకారుడైన నల్లూరి వెంకటేశ్వర్లు అలియాస్ నల్లూరి అన్న గారి పరిచయ ప్రభావం కారణంగా వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. నాట్య మండలిలో దివంగత టి. కృష్ణ, మాదాల రంగారావు మరియు పోకూరి సోదరులు పరిచయం అయ్యారు.
కాలేజీలో చదువుతున్న రోజుల్లో హరనాథరావుకి టి. కృష్ణ జూనియర్. ఇద్దరి భావాలూ ఒక్కటే కావడంతో ఇద్దరి మధ్యా స్నేహం పెరిగింది. ‘జగన్నాథ రథచక్రాలు’ నాటకంలో హరనాథరావు తండ్రిగానూ, టి.కృష్ణ కొడుకుగానూ నటించారు. దేవుని అస్తిత్వంపై చర్చే ఈ నాటకం. దీన్ని రాయడానికి హరనాథరావుకు రెండేళ్లు పట్టింది. ఈ నాటకానికి ఎన్ని ప్రశంసలు వచ్చాయో, అదే స్థాయిలో తీవ్రమైన విమర్శలూ వినిపించాయి. చెన్నైలో ‘జగన్నాథ రథచక్రాలు’ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు బి.ఎన్.రెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, ఆత్రేయ వంటి ప్రముఖులు చూసి హరనాథరావుని అభినందించారు. టి. కృష్ణతో చక్కని అవగాహన ఉండటంతో సినీరంగంలోనూ వారి అనుబంధం కొనసాగింది.
స్వతహాగా అభ్యుదయవాది. అందులోనూ నాటక రంగం నుంచి వచ్చారు. సమాజంలోని కుళ్లునీ, కుతంత్రాల్నీ పసిగట్టి కథలు రాశారు. నాటకాలు వేశారు. తన మాటల్నే ఆయుధాలుగా మలచుకొన్నారు. సినిమాల్లోకి వచ్చాకా ఆయనది అదే బాణీ. తన నాటకాలు చూసి, అందులో ఆయన లేవనెత్తిన సమస్యల్ని చూసి ‘నువ్వు సినిమాల్లోకి రావాల్సిందేనోయ్’ అంటూ హేమాహేమీల్లాంటి దర్శకులు ఆహ్వానాలు పంపారు. కానీ.. సున్నితంగా తిరస్కరించిన ఎం.వి.ఎస్ గారు మాత్రం స్నేహితుడు టి.కృష్ణ గారి పిలుపుని మాత్రం కాదనలేకపోయారు. కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఒకదానికి తప్ప మిగిలిన వాటన్నింటికీ హరనాథరావు రచన చేశారు. వీటిలో ‘ప్రతిఘటన’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘దేవాలయం’, ‘రేపటి పౌరులు’ చిత్రాలు హరనాథరావు మనసుకి నచ్చినవి.
అభ్యుదయ, విప్లవ చిత్రాలకే కాకుండా కమర్షియల్ సినిమాల రచయితగానూ రాణించారు ఎంవీయస్. ‘రాక్షసుడు’, ‘యం ధర్మరాజు ఎంఏ’, ‘మూడిళ్ల ముచ్చట’, ‘ధర్మచక్రం’, ‘పుణ్యభూమి నా దేశం’, ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్’, ‘సూత్రధారులు’, ‘మమతల కోవెల’, ‘మంచి దొంగ’, ‘స్వాతి కిరణం’, ‘రామాయణం’ వంటివి వాటిలో కొన్ని. దాదాపు 150 చిత్రాలకు సంభాషణలు రాసిన హరనాథరావు 20 పైగా చిత్రాలలో నటుడిగా తన ప్రతిభను చాటారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రంలో ‘అబ్బా! నీ యబ్బా ఎంకట సుబ్బా!’ అంటూ నరకాసురుడిగా చేసింది ఐదు నిముషాల నిడివి పాత్రే అయినా దాన్ని బాగా రక్తి కట్టించారు. అలాగే ‘స్వయంకృషి’, శోభన్‌బాబు హీరోగా నటించిన ‘దేవాలయం’ వంటి చిత్రాల్లో ఆయన విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారు.
సినీ పరిశ్రమలో టి.కృష్ణ, కె. విశ్వనాథ్, కోడి రామకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య వంటి ప్రముఖ దర్శకులెందరితోనో కలిసి పనిచేసిన హరనాథరావు మృదుభాషి, సౌమ్యుడు. రచయితగా అవకాశాలు తగ్గినా ఏనాడూ ఆయన నిరాశ చెందలేదు. తనకున్నది చాలనుకున్నారు. ఒకరిని దేహీ అని అడక్కుండా నడక సాగితే చాలనుకున్నారు. ‘ఆత్మసంతృప్తి ఉన్నవాడు గొప్ప ఆస్తిపరుడు’ అనేవారు హరనాథరావు. టి. కృష్ణ సినిమాలతో పాటు ‘ఉదయం’, ‘ఎర్ర మందారం’, ‘ఆకలీ నీకు జోహార్లు’, ‘ఎర్రోడు’ తదితర చిత్రాలు అందుకు ఉదాహరణ. ఆ ముద్ర నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. కొన్ని సినిమాలు రావడానికీ, మరి కొన్ని సినిమాలు పోవడానికీ ఆ ముద్రే కారణం.
రచయితగా ‘ఇదా ప్రపంచం’ చిత్రానికిగాను 1987లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్న హరనాథరావు, ఆ తర్వాత ‘ప్రతిఘటన’, ‘భారతనారి’, ‘అన్న’, ‘అమ్మాయి కాపురం’ వంటి చిత్రాలకు, ‘తళాంగు తకధిమి’ అనే నాటికకు రాష్ట్రప్రభుత్వ నంది పురస్కారాన్ని పొందారు. ఇవే కాకుండా చెన్నై కళాసాగర్ అవార్డు, దాసరి స్వర్ణ కంకణం, పినిశెట్టి శ్రీరాములు జీవన సాఫల్య పురస్కారం, జాలాది సినీ రచయితల అవార్డు, ఆచార్య ఆత్రేయ అవార్డు, ప్రజాశక్తి వారి పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు, చాట్ల శ్రీరాములు పురస్కారం మరియు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.
తన సొంత ఊరు గుంటూరు కంటే ఒంగోలు అంటే వల్లమాలిన అభిమానం. దాదాపుగా 150 చిత్రాలకు పనిచేస్తే... అన్ని సినిమాలన్నీ ఒంగోలులో కూర్చునే రాశారు. ‘‘ఒంగోలు వదలకుండా, అక్కడే కూర్చుని సినిమాలకు పనిచేసిన ఏకైక రచయితనేనేనేమో’’ అని ఎం.వి.ఎస్ చివరి వరకు గొప్పగా చెప్పుకొనేవారు. తన వివాహం కూడా ఒంగోలులోనే చేసుకున్నారు. చలం, గోపీచంద్, నరసరాజు, ఆత్రేయ... ఇలా హరనాథరావు అభిమాన రచయితల జాబితా పెద్దదే ఉంది. ‘అందరూ నా గురు సమానులే’ అనేవారాయన. హరనాథరావునీ గురువుగా భావించి, తయారైన శిష్యగణం ఎంతోమంది! వాళ్లంతా గురువు బా(మా)టలోనే నడుస్తూ విజయవంతమైన రచయితులుగా, దర్శకులుగా రాణించారు, రాణిస్తూనే ఉన్నారు.
తనని పదిమందికీ చూపించి, తన అక్షరాలను పరిచయం చేసింది నాటకమేనని హరనాథరావు చెప్పేవారు. అందుకే నాటకం మీద వ్యామోహంతో చివరి క్షణం వరకూ నాటకాలు రాస్తూనే ఉన్నారు. రాయడమే కాకుండా కొన్నింటికి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. పద్యనాటక పక్రియలో కొత్త ఒరవడి సృష్టించాలని ‘ప్రజాకవి వేమన’ పేరుతో నాటకం రాసి, అందులో వేమనగా నటించారు. అయితే ఆ నాటక ప్రదర్శనకు లక్ష రూపాయలు ఖర్చు అయ్యాయి కానీ తిరిగి వచ్చినదేమీ లేదు. దాంతో పద్య నాటకాలు తన వల్ల కాదని అంతటితో వాటికి ముగింపు పలికారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో చివరి రోజుల్లో ఒంగోలులోనే గడుపుతూ వచ్చారు. అక్షర సేద్యంలో చేయి తిరిగిన ఎం.వి.ఎస్.హరనాథరావు తన 69వ ఏట 2017, అక్టోబర్ 9న కన్నుమూశారు.ఈనాడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన స్ఫూర్తి ఎప్పటికీ మిగిలే ఉంటుంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!