YSRCP తరఫున త్వరలో యాప్‌..

- July 29, 2025 , by Maagulf
YSRCP తరఫున త్వరలో యాప్‌..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ వైసీపీ పొలిటికల్ అపైర్స్ కమిటీ సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, రీ కాలింగ్, చంద్రబాబు మ్యానిఫెస్టో, పార్టీ నిర్మాణం, కేసులు వంటి అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. “పార్టీ తరఫున త్వరలో యాప్‌ విడుదల చేస్తాం. ప్రభుత్వం వేధించినా, అన్యాయం జరిగినా..వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చు. ఫలానా వ్యక్తి, ఫలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు. ఆ ఆధారాలను కూడా అప్‌లోడ్‌ చేయొచ్చు.

ఆ కంప్లైంట్‌ ఆటోమేటిగ్‌గా మన డిజిటల్‌ సర్వర్లోకి వచ్చేస్తుంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.

ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్‌లోడ్‌ చేయొచ్చు.ఈ ఫిర్యాదుల పై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం.చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది.

రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.తప్పుడు కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే…టీడీపీలో ఎవ్వరూ ఉండరు. అందరూ జైళ్లకు వెళ్లాల్సివస్తుంది.

మిథున్‌రెడ్డి అరెస్టు బాధాకరం.. మిథున్‌, మేకపాటి గౌతం రెడ్డి రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్‌కు ఏం సంబంధం? కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారు.

పార్టీలో మహిళా నేతలను దుర్భాషలాడుతున్నారు.. అవమానిస్తున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఘోరంగా వైఫల్యం చెందారు కాబట్టే…ఈ తప్పడు కేసులు” అని అన్నారు.

వైసీపీ సమావేశంలో జగన్‌ భద్రతపై చర్చ జరిగింది. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళన కరంగా ఉందని పీఏసీ సభ్యులు అన్నారు. జగన్ భద్రంగా ఉంటేనే తాము, ప్రజలు బాగుంటామని సభ్యులు అన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే జగన్‌ భద్రతపై సమస్యలు సృష్టిస్తోందని తెలిపారు. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com