సాహిత్య వరేణ్యుడు-రావి శాస్త్రి

- July 30, 2025 , by Maagulf
సాహిత్య వరేణ్యుడు-రావి శాస్త్రి

కథకుడు కావాలంటే ముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలి.  జీవితాలను చదవాలి.  సామాన్యుల ఈతిబాధలను ఆకళింపు చేసుకోవాలి. ఆంతఃసంఘర్షణలను అక్షరీకరించగలగాలి. అప్పుడే వాస్తవాలకు దర్పణంగా ఆ కథ నిలుస్తుంది. పాఠకులను ఆలోచింపజేస్తుంది. ఆధిపత్యవర్గాల అన్యాయాలు, దౌర్జాన్యాలకు గురై చిత్రహింసలు అనుభవించే దీనజనుల జీవితాలను కళ్లకు కట్టినట్లు అక్షరీకరించిన కలం యోధుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన పేదల పక్షపాతి. అట్టడుగు వర్గాల ఈతిబాధలను సూటిగా, గుండెలను తాకేలా  చెప్పిన సాహితీశిల్పి. సామాన్యుల తరపున వకాల్తా పుచ్చుకుని వారి సాంఘిక, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం అక్షర బాణాలు సంధించిన సైనికుడు. 20వ శతాబ్దంలో తన అక్షర సేద్యంతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఘనుడు. శ్రీశ్రీ వంటి వారితో సమకాలీన రచనలు చేసినా తనదంటూ ఓ ప్రత్యేక శైలి, శిల్పం. సొంతం చేసుకున్న వ్యక్తి. పదమూడేళ్ల ప్రాయంలోనే కలాన్ని హలంగా మార్చి అక్షర సేద్యానికి శ్రీకారం చుట్టిన రావిశాస్త్రి ఊపిరి ఆగిపోయే వరకు రచనా వ్యాసంగాన్ని శ్వాస, ధ్యాసగా మార్చుకున్న తపస్వి. తన రచనలతో ఖండాంతర ఖ్యాతినార్జించిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం 

రాచకొండ విశ్వనాథ శాస్త్రి అలియాస్ రావి శాస్త్రి1922, జూలై 30న శ్రీకాకుళం పట్టణంలోని మతమహుల ఇంట
 రాచకొండ నారాయణమూర్తి, సీతారామలక్ష్మిల ఐదుగురి సంతానంలో రెండోవాడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. తండ్రి పేరున్న న్యాయవాది. అయితే కోర్టులో అబద్ధాలు చెప్పేసాహసం చేయలేక ఆ వృత్తికి స్వస్తిపలికి వ్యవసాయాన్ని జీవనోపాధిగా మార్చుకున్న అభ్యుదయవాది నారాయణమూర్తి. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావించారు. తండ్రి ఆలోచనలకు భిన్నంగా రావిశాస్త్రి ఆలోచనలు ఎదిగాయి. బాల్యం నుంచి సాహితీ ప్రయాణం తనకు ఇష్టమని భావించారు. కానీ అది ఎప్పుడూ తండ్రివద్ద బయటపెట్టలేదు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలనుకునేవారు. అందుకోసం నగరంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం, భిన్నరంగాల్లోని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వ్యాపకంగా పెట్టుకున్నారు. 13 ఏట నుంచి రచనలు చేయడం మొదలు పెట్టారు. కానీ తన సోదరుడు నరసింహశర్మకు తప్ప ఇంట్లో వేరెవరికీ వాటి గురించి చెప్పేవారు కాదు. పదిహేనేళ్ల ప్రాయంలోనే అప్పట్లో ప్రాచుర్యం ఉన్న పత్రికలు వినోది, చిత్రగుప్తల్లో ఆయన కథలు అచ్చయ్యాయంటే ఆయన సాహితీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వారి జీవితం మొత్తం విశాఖలోనే గడిపారు. 

రాచకొండ రచనా వ్యాసంగం భిన్నమైన శైలితో కొనసాగింది. సామాన్యుల మాండలికానికి పెద్దపీటవేస్తూ వారి హృదయాలను కొల్లగొట్టారు. రచనలకు సాహిత్యాన్ని అద్దే రచయితలున్న రోజుల్లో తన కవితాత్మక రచనలతో ఆలోచింపజేశారు. గురజాడ, శ్రీపాదల తర్వాత మాండలికానికి పెద్దపీట వేసిన వ్యక్తిగా రావిశాస్త్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అల్పజీవి, ఆరుసారా థలు, కథాసాగరం వంటివి ఆయనకు గొప్ప పేరు తీసుకువచ్చాయి. తాను బ్రాహ్మణుడు అయినా ‘ఇల్లు’ నవలలో బ్రాహ్మణుల తీరుపై ఎక్కువపెట్టిన బాణాలు ఆయనను విమర్శల పాలుచేసినా వాటిని హుందాగా స్వీకరించిన ఽధీశాలి. ఈ నవల ఇంగ్లీష్‌తోపాటు చైనీస్‌, రష్యన్‌ భాషల్లోకి అనువదించిన ఏకైక నవల ఇది. 


రావిశాస్త్రి రాసిన కథలు 75 దాకా లభిస్తున్నాయి. లభించనివి మరో 25 ఉంటాయి. ఆయన రాసిన నవలలు 10 దాకా ప్రచురితమయ్యాయి. అచ్చుకానివి మరో పదిదాకా ఉంటాయి. మూడు నాటకాలు రాశారు. ముందుమాటలు, పరామర్శలు, ఇంటర్వ్యూలు, లేఖలు- అంతా కలిపి ఆయన సాహిత్యం రెండున్నర వేల పుటలదాకా ఉంటుంది. ఆయన కథలలో వేతనశర్మ, పిపీలికం, ఎండ, లక్ష్మి వంటివి పాఠకులను ఎంతగానో ఆలోచింపజేశాయి. రావి శాస్త్రివి దాదాపు ఎనిమిది సంపుటాలలో కథలు వచ్చాయి. తిరస్కృతి, నిజం, విషాదం నాటకాలున్నాయి. అల్పజీవి, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి, మూడు కథల బంగారం, రత్తాలు-రాంబాబు, ఇల్లు వంటి నవలలు రాశారాయన. 'దారిద్య్రం ఎవ్వరికీ, నా పగవారిక్కూడా ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటాను' అన్నది రావిశాస్త్రి అభిప్రాయం. పేదరికంలో పుట్టిన రావిశాస్త్రి చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాక, పేదల పక్షమే వహించి సాహిత్య సృజన చేశారు. ఆయన పేదల రచయిత. సాంఘికంగానూ, ఆర్థికంగానూ అణచివేతకు గురైన వాళ్లవైపు నిలిచిన నిబద్ధతగల రచయిత. పీడితుల పక్షం వహించిన రావిశాస్త్రి సాహిత్యంలో రాజ్యం స్వరూప స్వభావాలు ప్రతిఫలిస్తాయి. 

రాజ్యానికి శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలు మూలస్తంభాలు. ఇవి ఎవరిపక్షాన ఉన్నాయో రావిశాస్త్రి తన సాహిత్యంలో కళ్లకుకట్టారు. రాజీ ఎరగని పోరాటం ఆయనది. మార్క్సిజం అందించిన సామాజిక చలన సూత్రాలతో జీవితాన్ని అర్థం చేసుకున్న రావిశాస్త్రి, స్వాతంత్య్రానంతర భారతీయ సామాజిక పరిణామాలను తన సాహిత్యంలో ప్రతిబింబించారు. ఆరు సారో కథలు, ఆరు సారా కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, కలకంఠి, ఓ మంచివాడి కథ, బాకీ కథలు, ఋక్కులు వంటి కథాసంపుటాలు, నవలలు, నాటకాల్లో స్వాతంత్ర్య అనంతర నాలుగు దశాబ్దాల సామాజిక జీవితం ఆవిష్కృతమైంది. 'నిజం' నాటకంలో రాజ్యం సంపన్నులవైపు ఉన్నదన్న నిజాన్ని, 'ఇల్లు' నవలలో సొంత ఆస్తి అదుపు తప్పితే మానవ సంబంధాలు ఎలా ఉంటాయో చెబుతారు. 'మూడు కథల బంగారం' కూడా బంగారం రూపంలో సొంత ఆస్తి ఏయే పాత్రలు నిర్వహిస్తుందో చెబుతుంది. విశాఖ ప్రాంత గ్రామీణ భాషలో రావిశాస్త్రి రాసిన 'సొమ్ములు పోనాయండి' నవల ఆయన రాజకీయార్థిక పరిజ్ఞానానికి దర్పణం. చిన్నవాళ్లకు చిన్న తగాదాలే విషమ సమస్యలుగా ఎలా పరిణమిస్తాయో 'అల్పజీవి' నవల ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1960లలో సారా నిషేధం విధించినప్పుడు దొంగసారా వ్యాపారం పెరిగిపోయిన తీరును ఆరు సారా కథలు వాస్తవికంగా చిత్రించాయి. 

రావిశాస్త్రిపై ఆయన తల్లి సీతారామలక్ష్మమ్మ ప్రభావం అధికం. ఆమె స్వతహాగా రచయిత కావడంతో రావిశాస్త్రిపై ఆ ప్రభావం మెండుగా పడింది. ఈ కారణంగా బాల్యం నుంచే పుస్తక పఠం అలవడింది. టాల్‌ స్టాయ్‌తోపాటు పలువురు ప్రముఖుల నవలలను ఎక్కువగా చదుతుండేవారు. అలా రచనలపై మక్కువ పెంచుకున్నారు. ఆయన ప్రయోగాత్మక నవలల్లో ‘అల్పజీవి’ ప్రధానమైనది. జేమ్స్‌ జాయిల్‌ చైతన్యస్రవంతి ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. ఆయన తొలి నవల కూడా ఇదే. ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. తెలుగు సాహిత్యంలో విప్లవాన్ని సృష్టించింది. ‘రాజు మహీషి, రత్తాలు-రాంబాబు’లు ఆయనకు పేరు తెస్తే చివరిలో రాసిన ‘ఇల్లు’ నవల ఆయనకు ప్రపంచఖ్యాతిని సొంతం చేసింది.

'ఆరు సారో కథలు' మానవ సమాజంలో, పేదల జీవితంలో దుఃఖం ఎలా ఉందో ఆవిష్కరించాయి. ఒక కవి మాటలు శీర్షికలుగా కథలు రాయడం బహుశా రావిశాస్త్రితో మొదలైందేమో! శ్రీశ్రీ రచించిన 'ఋక్కులు' అనే కవితలోని కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, అరటితొక్క, రొట్టెముక్క, బల్లచెక్క, హారతిపళ్ళెం, తలుపుగొళ్ళెం పదాలు శీర్షికలుగా రావిశాస్త్రి కథలు రాశారు. 'కాదేదీ కవితకనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లు 'కాదేదీ కథకనర్హం' అని ధ్వన్యాత్మకంగా రావిశాస్త్రి చెప్పారు. తన కథల్లో కవిత్వాంశను పుష్కలంగా చేర్చారు. విశాఖ ప్రాంత సామాన్యుల భాష ఆయన రచనలను అలంకరించి సాహిత్య గౌరవం పొందింది. 1950-90 మధ్య నాలుగు దశాబ్దాలలో ఆయన రచించిన సాహిత్యం 1990 తరవాత భారతదేశ ఆర్థిక రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడం సహా ప్రపంచీకరణ ప్రభావాన్ని రచనలుగా మలచడానికీ తోడ్పడుతుంది. తెలుగు సాహిత్య రంగాన్ని అన్ని విధాలా సుసంపన్నం చేసిన రావి వారు తన 71వ ఏట అనారోగ్యంతో 1993, నవంబర్ 10న విశాఖపట్నంలో కన్నుమూశారు. తెలుగు వారికి దూరమై దశాబ్దాలు గడుస్తున్నా తన సాహిత్యంలో చూపించిన ప్రపంచమే, ప్రపంచీకరణ కాలంలో ఇంకా విస్తరించింది గనుక, ఇప్పటి సాహిత్యంలోనూ ఆయన గుర్తులు కనిపిస్తాయి. ఈ అవిచ్ఛిన్నతను గుర్తించాలి. నేటి మన కథలు, నవలలు, నాటకాలలో ఆయన పాత్రలు, పరిస్థితులు రూపం మార్చుకున్న తీరును అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com