సింగపూర్‌లో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన

- July 30, 2025 , by Maagulf
సింగపూర్‌లో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన

సింగపూర్: సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడమే కాకుండా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.నాలుగు రోజుల పాటు సీఎం వివిధ సమావేశాలు, రౌండ్‌టేబుల్ చర్చల్లో పాల్గొని పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.సీఎం సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్‌తో సమావేశమయ్యారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి టాన్ సీ లెంగ్, సెక్యూరిటీ, హోం వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం‌లతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి అభివృద్ధిలో సహకారం అందించాలని కోరారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. నవంబర్ 14-15న విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.

సీఎం సుర్బానా జురాంగ్, సెంబ్ కార్ప్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, ఏఐ సింగపూర్, కెప్పెల్ కార్పొరేషన్, జీఐసీ, ఎస్ఎంబీసీ, కాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ఎవర్సెండై ఇంజనీరింగ్, టామ్ సెక్, విల్మర్, టీవీఎస్ మోటార్స్, అదానీ పోర్ట్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అనుకూల పాలసీలపై అవగాహన కల్పించారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు.

పర్యటనలో సీఎం బృందం సింగపూర్‌లోని బిడదారి ఎస్టేట్, జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్, టువాస్ పోర్ట్, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించింది. ఈ ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించారు. వాటిని ఏపీలో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణాభివృద్ధి, ఐటీ, ఏఐ, ఫిన్టెక్, మారిటైమ్, పోర్టుల మౌలిక సదుపాయాలపై కూడా చర్చలు జరిగాయి.

పర్యటనలో నిర్వహించిన ‘తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా’ సమావేశం విశేషంగా ఆకట్టుకుంది. సింగపూర్‌తో పాటు ఐదు దేశాల నుంచి వచ్చిన తెలుగువారు సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. పర్యటన చివరి రోజున కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వెంటనే విజయవాడ బయలుదేరనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com