స్వరాజ్య పోరాట యోధుడు-బాలగంగాధర్ తిలక్
- August 01, 2025
మనం అనుభవిస్తున్న స్వాతంత్రం..ఎందరో మహోన్నత వ్యక్తుల త్యాగాల ఫలితం. స్వాతంత్ర పోరాటంలో సమిధలుగా మారి..ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. అటువంటి వారిలో బాలగంగాధర్ తిలక్ ఒకరు 'స్వరాజ్యం నా జన్మ హక్కు' అంటే, ఇంకొకరు స్వరాజ్య సాధన కోసం జీవితాన్నే త్యాగం చేశారు.తిలక్ తన మాటలతో యువతలో స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన దిశగా సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపించారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
జాతీయవాదానికి బీజం వేసి, స్వరాజ్యకాంక్షను రగిలించిన మహా నాయకుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు. భారతీయతకు ప్రతీక ఆధునిక భావాలతో కళాశాల విద్య అభ్యసించిన తిలక్, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. పాశ్చాత్య విద్యావిధానం వల్ల భారతీయుల్లో సంస్కృతి పట్ల అవగాహన కొరవడిందని, అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా ఉందనే ఉద్దేశంతో బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు.
స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసిన ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయుల్లో మొదటి వారు తిలక్. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు.
మంచి విద్య ద్వారానే మంచి పౌరులు తయారవుతారనే ఆలోచనతో, ప్రతి భారతీయుడికి సంస్కృతి గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి బోధించాలన్న సంకల్పంతో 'డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ' స్థాపించారు. మరాఠీ భాషలో కేసరి దినపత్రికను నడిపి, వాక్ స్వాతంత్య్రం, భారతీయ సంస్కృతి పట్ల బ్రిటిష్ పాలకులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై, తిలక్ యుద్ధం ప్రకటించారు. భారతీయ సంస్కృతిపై బ్రిటిష్ నాయకుల అణచివేతను 1857 తిరుగుబాటు తరువాత అంతగా నిరసించిన వ్యక్తిగా ఆయన పేరు చెప్పుకోవాలి.
స్వాతంత్ర పోరాటంలో తిలక్ అనేకమార్లు జైలుకు వెళ్లారు. ఏ దశలోనూ జైలు గదులు ఆయన స్వరాజ్య నినాదాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయనను జైల్లో బంధించడాన్ని రాజనీతిజ్ఞులంతా వ్యతిరేకించి, విడుదల చేయమంటే- ఉత్సవాల్లో పాల్గొనకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే ఆంక్షలను నాటి ప్రభుత్వం ఆయన ముందుంచింది. పిరికివాడిగా బతకడం కంటే అండమాన్ జైలులో ఉండటమే మేలని నాడు ఆయన చెప్పిన మాటలు యావత్ దేశాన్ని ఉత్తేజపరచాయి. 1908లో దేశద్రోహ నేరం కింద నాటి బ్రిటిష్ కోర్టు ఆరేల్ల పాటు ద్వీపాంతర జైలుశిక్ష విధించింది. 1908 నుంచి 1914 వరకు తిలక్, బర్మాలోని మాండలే జైలులో ఉన్నారు. చాలా చిన్న జైలుగదిలో ఒంటరి జీవితం గడిపిన తిలక్, గీతారహస్యం పేరుతో భగవద్గీత మీద గొప్ప వ్యాఖ్యానం రాశారు.
జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని తిలక్ వదిలిపెట్టలేదు.దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు తిలక్ ప్రారంభించినవే. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఇవన్నీ స్వరాజ్య సాధనకు ప్రభావిత మాధ్యమాలుగా మారాయి.ఇవే తిలక్‌కు స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ప్రాధాన్యత కల్పించాయి.1920, ఆగస్టు 1న తిలక్ కన్నుమూశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ నిర్మణానికి చేసిన కృషికి గుర్తుగా ఆయన్ని 'నవభారత నిర్మాత'గా మహాత్మ గాంధీ అభివర్ణించారు.తిలక్ తరవాతా ఆయన స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమం దిశగా యావత్ భారతాన్ని నడిపించింది. నేటికీ జాతీయవాద స్ఫూర్తిని మనలో నింపుతూనే ఉంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







