నాకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

- August 01, 2025 , by Maagulf
నాకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్న టెలికాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో ఆయన పార్టీ భవిష్యత్ వ్యూహాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, కార్యకర్తల ప్రాధాన్యం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.చంద్రబాబు మాట్లాడుతూ, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు.పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన వారిని నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను ప్రారంభించి, అర్హులైన వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. “నా దృష్టిలో కార్యకర్తలే పార్టీకి పునాది, వారిని గౌరవించడమే మా కర్తవ్యం” అని ఆయన పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సరిగా చేరలేదని, దానివల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన విశ్లేషించారు.ఈసారి అలాంటి తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ క్యాడర్‌కి దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నెలలో ప్రారంభించబోయే అన్నదాత సుఖీభవ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు.

అంతేకాకుండా, చంద్రబాబు గత ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని, మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా పేరుతో నిజమైన సాయం అందించకుండా అన్నదాతలను మోసగించారని మండిపడ్డారు.గత ఐదేళ్లలో వ్యవసాయరంగం దెబ్బతిన్నదని, రైతుల అప్పులు పెరిగిపోయాయని, పంటల సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com