జాతీయ పతాక రూపశిల్పి .....!

- August 02, 2025 , by Maagulf
జాతీయ పతాక రూపశిల్పి .....!

భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం.అఖండ భారతావని సగర్వంగా ఆవిష్కరించుకునే మువ్వన్నెల జాతీయ పతాకం..ప్రతి రోజూ సమున్నతంగా ఎగురుతుంటే ప్రతి భారతీయుడి శరీరం పులకరిస్తుంది.ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం.దీని రూపశిల్పి మన అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. నేడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధేయవాది పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పింగళి హనుమంతరాయుడు, తల్లి వెంకటరత్నం. చల్లపల్లి మండలం యార్లగడ్డలో, మొవ్వ మండలం భట్లపెనుమర్రులో, మోపిదేవి మండలం పెదకళ్లపేల్లిలో బాల్యం, విద్యాభ్యాసం కొనసాగించారు.

మచిలీపట్నం హిందూ హైస్కూలులో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించారు. పామర్రు గ్రామకరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాక.. 19 ఏళ్లకే బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయెర్‌ యుద్ధం(1899-1902)లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ మహాత్మాగాంధీని కలుసుకున్నారు. బ్రిటిష్‌ జాతీయ పతాకానికి సైనికులు సెల్యూట్‌ చేసే ఘటన వెంకయ్య మదిలో నిలిచిపోయింది. స్వదేశానికి వచ్చాక మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ.. మన దేశానికి కూడా జాతీయ పతాకం కావాలని.. రూపకల్పనకు నడుం బిగించారు.

స్వాతంత్య్ర ఉద్యమ కార్యాచరణ కోసం జరిగే అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాల్లో పింగళి తరచూ పాల్గొనేవారు. 1906లో కలకత్తాలో కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్‌ వారి జాతీయ జెండాను కాంగ్రెస్‌ నాయకులు ఆవిష్కరించడం చూసి ఎంతో కలత చెందారు. మన దేశానికి ఒక జాతీయజెండా ఉండాలనే ఆవశ్యకతను గుర్తించి కాంగ్రెస్‌ సమావేశాల్లోనూ నొక్కిచెప్పేవారు. ఇతర దేశాల పతాకాలపైనా అధ్యయనం చేశారు. భారత జాతీయ పతాకం ఎలా ఉండాలో 30 రకాల డిజైన్లు సిద్ధం చేసి.. 1916లో ‘ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ అనే బుక్‌లెట్‌ ప్రచురించారు.

1921 మార్చి 31- ఏప్రిల్‌ 1న మహాత్మాగాంధీ విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశానికి వచ్చారు. పింగళి ఆయన్ను కలిసి.. ఖద్దరుపై తాను రూపొందించిన ‘స్వరాజ్‌’ పతాకాన్ని అందజేశారు. హిందువులు, ముస్లింలను ప్రతిబింబించే ఎరుపు, పచ్చ రంగులు మాత్రమే అందులో ఉన్నాయి. మధ్యలో స్వరాజ్యానికి గుర్తుగా చరఖాను పెట్టారు. గాంధీజీ సలహాతో తెల్ల రంగును కూడా కలిపి మూడు గంటల్లో తయారుచేసి ఇచ్చారు. గాంధీజీ ముగ్ధుడయ్యారు. గాంధీజీ, కాంగ్రెస్‌ అగ్ర నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలా, తొలిసారి జాతీయజెండా విజయవాడలోనే రెపరెపలాడింది.

ఆ ఏడాది ఏప్రిల్‌ 13న ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో మహాత్మాగాంధీ మన జాతీయపతాకం అనే శీర్షికతో ప్రత్యేక వ్యాసం రాశారు. నాటి నుంచి పింగళి ‘జెండా వెంకయ్య’గా ప్రసిద్ధుడయ్యారు. దేశమంతటా 1931 వరకు ఈ స్వరాజ్‌ పతాకమే రెపరెపలాడింది. ఆ ఏడాది పతాకంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఎరుపు రంగు స్థానంలో కాషాయ రంగు వచ్చింది. పతాకం పై భాగాన ఈ రంగు, మధ్యలో తెలుపు, ఆ తర్వాత పచ్చ రంగు వచ్చాయి. మధ్యలో తెల్ల రంగుపై చరఖాను చేర్చారు.

1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో.. నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ.. మధ్యనున్న తెలుపు రంగులోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మ చక్రాన్ని చిహ్నంగా జెండా వెలువరించారు. ఒక్క చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు.. నేటి జెండాకు తేడా లేదు. దేశానికి ఎన్నో(pingali) రకాలుగా సేవలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్యకి స్వాతంత్య్రం అనంతరం తగిన ఆదరణ లభించలేదు. వృద్ధాప్యంలో తినడానికి తిండి లేకుండా కటిక పేదరికం అనుభవించి జూలై 4 వ తేదీ 1963లో మరణించారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com