రక్తదానం చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను: మెగాస్టార్ చిరంజీవి
- August 06, 2025
హైదరాబాద్: 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు.ఈ రోజు నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేస్తున్నారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు.నాకు అత్యంత ఆప్తుడైన సురేష్ చుక్కపల్లి వారు చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు గత రెండేళ్లుగా ఈ బ్లడ్ డొనేషన్ కూడా మొదలుపెట్టి నా హృదయానికి మరింత దగ్గర అయ్యారు.ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు సురేష్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కార్యక్రమానికి విచ్చేయడమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డ లాంటి తేజ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే కాదు తన ఎన్నోసార్లు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంయుక్త కి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవికి మిగతా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రక్తదానం చేస్తున్న దాతలు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రక్తదానం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుంది.దాని వలన ఒక ప్రాణం నిలబడుతుంది. నేను ఇది ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్. రక్తదానం గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ కొత్త జనరేషన్ కొత్త యువత వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది.ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే నాకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆయనను ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను.దాదాపు 27 ఏళ్ల క్రితం రక్తం దొరకక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తర్వాత ఎందుకు రక్తం దొరకడం లేదు అనే ఒక ఆలోచన నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేది. మన అభిమానుల్ని బ్లడ్ డొనేషన్ వైపు మళ్లించగలిగితే గనుక ఒక అత్యంత శక్తివంతమైన సామాజిక సేవ వైపు నడిపినట్లుగా ఉంటుందని, దాని ద్వారా వారికి కూడా ఒక మంచి సంతృప్తి వస్తుంది కదా, ఒక మంచి పనికి నాంది పలికిన వాడిని అవుతానని ఆరోజు ఇచ్చిన పిలుపు..ఈరోజు లక్షల మంది రక్తదానం వైపు కదిలించింది.ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. రక్తదానం అనగానే నా పేరు స్ఫురించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం గా భావిస్తున్నాను. ఎన్నో జన్మలుగా చేసిన పుణ్యఫలంగా భావిస్తున్నాను.ఈ మధ్యకాలంలో ఒక పొలిటీషియన్ నాపై అకారణంగా అవాకులు చవాకులు పేలారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురుతిరిగింది. ‘చిరంజీవిని అన్నన్ని మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించింది’ అని నిలదీసింది.ఆ వీడియో చూసి ఆమె గురించి వివరాలు కనుక్కొన్నాను. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందుకే నేనంటే ఆమెకు గౌరవమని తెలిపింది. ఆ మాటలు నా మనసుని టచ్ చేశాయి. విమర్శలపై ఎందుకు స్పందించరు అని నన్ను అందరూ అడుగుతారు. నేనెప్పుడూ స్పందించను.ఎందుకంటే నేను చేసిన మంచి కార్యక్రమాలు, నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. ఆ మహిళ మాట్లాడిన తర్వాత సదరు రాజకీయ నాయకుడు ఎక్కడా నా గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లకు కూడా మనసు ఉంటుంది కదా. ఆ క్షణంలో కోపంలో నన్ను తిట్టినా... ఇంటికి వెళ్లాక వాళ్ల భార్య అయినా మరోసారి ఇలా మాట్లాడొద్దు అని చెబుతుంది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరైనా మాటలు అంటే మన మంచే సమాధానం చెబుతుంది.అందుకే నేను ఎప్పుడూ దేనికీ స్పందించను.మంచి చేసుకుంటూ వెళ్తాను.నాలాగా మంచి చేసే నా తమ్ముళ్లకు సాయంగా ఉంటాను.ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా నా మాటను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేస్తున్నారు.వాళ్లందరికీ అభినందనలు. ఇలాంటివి అద్భుతమైన కార్యక్రమాన్ని చేసిన నా మిత్రుడికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా నన్ను పిలవండి. నేను మీకు అందుబాటులో ఉంటాను.అందరికీ ధన్యవాదాలు'అన్నారు
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ..మెగాస్టార్ చిరంజీవికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం.ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సురేష్ చుక్కపల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ఒక ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. తప్పకుండా అందరూ బ్లడ్ డొనేట్ చేయండి. ప్రాణాల్ని కాపాడండి. బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవిదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా ఎక్కడైనా రక్తం కావాల్సి వస్తే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారితో ఈ వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.రక్తదాతలందరికీ ధన్యవాదాలు'అన్నారు
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ...అందరికి నమస్కారం.ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు ధన్యవాదాలు.నేను చిరంజీవికి పెద్ద అభిమానిని.ఆయనతో ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఈరోజు ఇంత మంది రక్తదానం చేయడానికి మూల కారణమైన చిరంజీవి గారికి ధన్యవాదాలు.రక్తదానం ఒక ప్రాణం నిలబెడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు
ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా అన్న చిరంజీవి గారు, తేజ, సంయుక్త అందరికీ ధన్యవాదాలు. రక్తదాతలందరికీ పాదాభివందనాలు. ఈరోజు వారు చేసిన దానం ఎన్నో వందల ప్రాణాలని కాపాడబోతుంది.చిరంజీవి చేసిన ఇంత గొప్ప కార్యక్రమంతో ఎన్నో లక్షల ప్రాణాలు నిలబడ్డాయి.ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక పాదాభివందనాలు.గత రెండు సంవత్సరాలుగా మేము జాయింట్ గా ఈ కార్యక్రమం చేస్తున్నాము.భవిష్యత్తులో కూడా మేము కలిసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు'అన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







