విడాకుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

- August 07, 2025 , by Maagulf
విడాకుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు

న్యూ ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ కుటుంబ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతకాల వివాహాల పై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, మన సంప్రదాయాల మీద ఉన్న గౌరవం తగ్గిపోతోందని అన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు.

వివాహాల పట్ల నేటి తరంలోని దృష్టికోణం మారిపోతుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. “ఇప్పుడు ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకుంటున్నారు..కెమిస్ట్రీ బాగోలేదని విడిపోతున్నారు,” అంటూ చలోక్తిగా వ్యాఖ్యానించారు. విడాకుల సంఖ్య పెరగడాన్ని ఆయన ఆందోళనగా చూశారు. “ఇది మంచి సంప్రదాయం కాదు” అని స్పష్టం చేశారు.

వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు, భాజపా సీనియర్ నేత వల్లూరు శ్రీమన్నారాయణకు విజయవాడలో జరిగిన అభినందన సభలో చేశారని తెలిసింది. 56 ఏళ్లుగా భాజపాలో సేవలందిస్తున్న శ్రీమన్నారాయణను ప్రశంసిస్తూ, రాజకీయాలలో పదవుల కోరికకంటే నిబద్ధతే ముఖ్యమని గుర్తు చేశారు.

నేటి రాజకీయాల్లో నాయకులు తరచూ పార్టీలు మారడం చూసి ఆయన విమర్శించారు. “ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తేలికగా అర్థం కావడం లేదు. నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకలా మారిపోయింది,” అని వ్యాఖ్యానించారు.

ఇటువంటి పరిస్థితుల్లో కూడా వల్లూరు శ్రీమన్నారాయణ వంటి నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. జట్కా బండిపై తిరిగి వాజ్‌పేయి, అద్వానీ ప్రచారం చేసిన రోజుల్లో నుంచే శ్రీమన్నారాయణ భాజపా పదవుల ఆశ లేకుండా, కేవలం నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com