పసిపాప అని కూడా చూడకుండా గోడకేసి కొట్టిన డే కేర్‌ సిబ్బంది

- August 11, 2025 , by Maagulf
పసిపాప అని కూడా చూడకుండా గోడకేసి కొట్టిన డే కేర్‌ సిబ్బంది

పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు డే కేర్ సెంటర్‌లు ఒక అనివార్యమైన ఎంపికగా మారాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని, సురక్షితంగా ఉంటారని నమ్మి చాలామంది తమ చిన్నారులను డే కేర్‌లలో వదిలి వెళ్తుంటారు. కానీ నోయిడా(Noida )లో జరిగిన ఒక సంఘటన డే కేర్‌ల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, నోయిడాకు చెందిన ఒక ఉద్యోగస్తుల దంపతులు తమ 15 నెలల పాపను స్థానిక డే కేర్ సెంటర్‌లో వదిలేవారు. ఇటీవల, ఆ చిన్నారి శరీరంపై గాయాలు, కొరికిన గుర్తులు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది.

తల్లిదండ్రులు డే కేర్ సెంటర్‌కు వెళ్లి నిలదీయగా, అక్కడి సీసీటీవీ ఫుటేజీలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో పని చేసే ఒక ఆయా, పాప ఎక్కువగా ఏడుస్తుండటంతో అసహనానికి గురైంది. ఆ పాపను కిందపడేసి, గోడకేసి కొట్టడం, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టడం వంటి దారుణాలకు పాల్పడింది. ఈ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. యాజమాన్యం తమ తప్పును ఒప్పుకోవడానికి బదులు వారిని దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

తల్లిదండ్రులు సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఆయానను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆయాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలపై ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన డే కేర్‌లలో పిల్లలను వదిలే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, వీలైనంతవరకు సొంత కుటుంబ సభ్యుల వద్ద పిల్లలను చూసుకునేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ ఘటన డే కేర్‌ల నిర్వహణపై ప్రభుత్వ నిఘా అవసరాన్ని నొక్కి చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com