సినిమా రివ్యూ: ‘కూలీ’

- August 14, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కూలీ’

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘కూలీ’. ఈ సినిమాకి నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబీన్, సత్యరాజ్, శృతి హాసన్  తదితర భారీ తారాగణం ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. అలాగే ప్రమోషన్లు కూడా భారీ రేంజ్‌లోనే నిర్వహించారు.అయితే ఈ సినిమా అంచనాల్ని అందుకుందా.? లేదా.? అనేది  తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

పోర్టులో అక్రమ వ్యాపారం చేస్తుంటాడు సైమన్ (నాగార్జున). సైమన్ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నం చేసిన పోలీసుల్ని ఆనవాళ్లు తెలియకుండా చంపేస్తుంటాడు దయాల్ (సౌబీన్). అలాగే రాజశేఖర్ అనే పోలీస్ ఆఫీసర్ సైమన్ అక్రమ వ్యాపార గుట్టు రట్టు చేయడానికి ప్రయత్నించే క్రమంలో హత్యకు గురవుతాడు. రాజశేఖర్‌కి ప్రాణ మిత్రుడైన దేవా (రజనీకాంత్) విషయం తెలుసుకుని అతని ఆఖరి చూపు కోసం వస్తాడు. కానీ, రాజశేఖర్ కూతురు ప్రీతి (శృతి హాసన్) దేవాని అడ్డుకుంటుంది. అదే క్రమంలో ప్రీతికి ఆమె చెల్లెళ్లకు ప్రాణాపాయం వుందని తెలుసుకున్న దేవా ఏం చేశాడు.? అసలెందుకు ప్రీతి, దేవాని అడ్డుకుంది.? సైమన్ అరాచకాలకు ఎలా చెక్ పడింది.? దేవాకీ, సైమన్‌కీ గతంలో ఏదైనా వైరం వుందా.? దాహా (అమీర్ ఖాన్) ఎవరు.? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘కూలీ’ సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

లోకేష్ కనగరాజ్ ఈ సినిమా కోసం వివిధ భాషల నుంచి పలువురు స్టార్ హీరోలను కాస్టింగ్‌గా ఎంచుకున్నాడు. కానీ, ఫోకస్ మొత్తం రజనీకాంత్ ‌పైనే పెట్టాడనుకోండి. ఆయన పాత్రను పవర్ ఫుల్‌గా చిత్రీకరించడంలో వందకు వంద మార్కులేయించుకున్నాడు. అలాగే తొలిసారి సైమన్ పాత్ర కోసం నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లోకి మారిపోయాడు. నిజానికి ఈ పాత్ర సినిమాకి చాలా స్పెషల్ అయ్యుండాలి. కానీ, ఎందుకో అంత ఎఫెక్టివ్‌గా ఈ పాత్రను లోకేష్ తీర్చిదిద్దలేదనిపిస్తుంది. అక్కడక్కడా నెగిటివ్ షేడ్స్‌లో నాగార్జున తడబడ్డారు. కానీ, సినిమా మొత్తం చాలా స్టైలిష్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపించారు. ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ మలయాళ నటుడు సౌబిన్. నిజానికి ఈ సినిమాకి అతనే హీరో అని చెప్పడం అతిశయోక్తి అనిపించదు. అంతలా తన పర్‌ఫామెన్స్‌తో కట్టి పడేశాడు. అందర్నీ డామినేట్ చేసేశాడు. అంతేకాదు, ‘మోనికా..’ స్పెషల్ సాంగ్‌లో స్పెషల్ హుక్ స్టెప్స్‌తో పూజా హెగ్దేని సైతం డామినేట్ చేసి అదరహో అనిపించాడు. శృతి హాసన్.. సత్యరాజ్ కూతురి పాత్రలో తన బెస్ట్ ఇచ్చింది. అలాగే సత్యరాజ్ అండర్ కవర్ పోలీసాఫీసర్ పాత్రలో స్కోప్ తక్కువే వున్న పాత్ర చేసినప్పటికీ ఆయన ఇంపాక్ట్ సినిమా మొత్తం వుందనిపిస్తుంది.  గెస్ట్ రోల్స్‌లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. మిగిలిన పాత్రలన్నీ ఓకే. 

సాంకేతిక వర్గం పనితీరు:

లోకేష్ కనగరాజ్ సినిమాలంటే కథలపై ఓ ఐడియా వుంటుంది. ఖచ్చితంగా డ్రగ్స్, మాఫియా, అక్రమ దందాల బ్యాక్ గ్రౌండ్ వుంటుంది. అలాగే, ఈ సినిమా కోసం కూడా ఏమాత్రం మార్పు లేకుండా అదే బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నాడు. అయితే, కథ, కథనాల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేదన్న అభిప్రాయం వెల్లువెత్తుతుంది. తెలిసిన కథకే కాస్త అటూ ఇటూ సెంటిమెంట్ అండ్ డ్రామా యాడ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించాడు. భారీ తారాగణాన్ని తీసుకోవడం వల్ల అంతా కలగా బులగం అయ్యిందన్న ఫీల్ వస్తుంది అభిమానులకి. కానీ, ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ ప్రాణం పెట్టేశాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బీజీఎమ్ దుమ్ము దులిపేశాడు. పాటల విషయంలో కొత్తేం లేదు పాత మ్యూజిక్‌నే మళ్లీ కొట్టాడనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి మరో అస్సెట్. అలాగే, ఎడిటింగ్ విషయంలో లాగ్ అనిపిస్తుంది. కానీ, అన్ని క్యారెక్టర్స్‌ని మ్యానేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రొడక్షన్ వేల్యూస్ ఈ సినిమాకి మరో పెద్ద అస్సెట్. క్వాలిటీ చాలా బాగుంది తెరపై. మిగిలిన సాంకేతిక వర్గం అంతా బాగా సపోర్ట్ చేసింది.

ప్లస్ పాయింట్స్: 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఘట్టాలు, సౌబీన్ పర్‌ఫామెన్స్.. సినిమాటోగ్రఫీ..

మైనస్ పాయింట్స్:

పాత రొటీన్ రొట్ట కొట్టుడు కథే, సెకండాప్‌లో కొన్ని డల్ సీన్లు.. విలనిజంలో కొన్ని తడబాట్లు మొదలైనవి.

చివరిగా:

అంత మంది స్టార్ హీరోలను ఒకేసారి తెరపై చూడడం అభిమానులకు నిజంగా అదృష్టమే. అందుకే పాత కథే అయినా స్క్రీన్‌ప్లే, నెరేషన్‌లో కొత్తదనం లేకున్నా..పెద్ద తెరపై ‘కూలీ’ సినిమా ఓ సారి చూసేయొచ్చు.  

గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్: Phars Film Co. LLC

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com