బ్ర‌హ్మోత్స‌వ ఏర్పాట్లును ప‌రిశీలించిన టీటీడీ ఈవో

- August 20, 2025 , by Maagulf
బ్ర‌హ్మోత్స‌వ ఏర్పాట్లును ప‌రిశీలించిన టీటీడీ ఈవో

తిరుమ‌ల‌: సెప్టంబ‌ర్ 24వ తేది నుండి అక్టోబ‌ర్ 2వ తేది వ‌ర‌కు తిరుమ‌ల‌లో నిర్వ‌హించ‌నున్న శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో  జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జిల్లా ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాజు, టీటీడీ సీవీఎస్వో ముర‌ళీకృష్ట‌ల‌తో క‌లిసి బుధ‌వారం సాయంత్రం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా గ్యాల‌రీల్లో భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా వాహ‌న సేవ‌ల‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో అధికారుల‌ను ఆదేశించారు. సెప్టంబ‌ర్ మొద‌టి వారంలోపు ఇంజినీరింగ్ ప‌నులు పూర్తి చేయాల‌ని చెప్పారు.

అనంత‌రం ఈవో మీడియాతో సెప్టంబ‌ర్ 24వ తేది ధ్వ‌జారోహ‌ణం రోజు ముఖ్య‌మంత్రివ‌ర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నార‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భారీ సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ పై క్షేత్రస్థాయిలో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. మాడ వీధుల్లో అద‌న‌పు మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. పారిశుధ్యం కోసం అద‌న‌పు సిబ్బంది నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు.

గ్యాల‌రీల్లో ఉన్న ప్ర‌తి భ‌క్తుడికి అన్న ప్ర‌సాదాలు అందేలా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త ఏడాది గ‌రుడ‌వాహ‌న సేవ‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగా భ‌క్తులు విచ్చేశార‌ని, అందుకనుగుణంగా ఈ ఏడాది అద‌న‌పు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు.తిరుమ‌ల‌లో ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ముంద‌స్తుగా పార్కింగ్ ప్ర‌ణాళిక‌లు రూపొందించి తిరుప‌తిలో కూడా పార్కింగ్ లు ఏర్పాటు చేసి ఆర్టీసీ బ‌స్సుల్లో తిరుమ‌ల‌కు వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీఈ స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ ఈవో లోక‌నాథం, అడిష‌న‌ల్ ఎస్పీ  రామ‌కృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com