ఏపీ: నిమజ్జనంలో అపశ్రుతి..

- August 31, 2025 , by Maagulf
ఏపీ: నిమజ్జనంలో అపశ్రుతి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు.పాడేరు మండలం చింతలవీధిలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో భక్తులు ఆనందంగా నృత్యం చేస్తుండగా, వేగంగా వచ్చిన ఒక స్కార్పియో కారు వారి పైకి దూసుకొచ్చింది.ఈ ఘటనతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

అతి వేగంగా దూసుకొచ్చిన కారు భక్తులను ఢీకొట్టడంతో కొందరు గాల్లోకి ఎగిరిపడ్డారు.ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వినాయక నిమజ్జనం వంటి పండుగ వాతావరణంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పండుగల సమయంలో భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టంగా ఉండాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.ఈ విషాద ఘటనతో జిల్లాలో పండుగ వాతావరణం మసకబారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com