రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- September 12, 2025
తిరుపతి: తిరుపతిని యాంకర్ హబ్ గా చేసి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక భూ కేటాయింపుల విధానం తదితర పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పర్యాటకంగా తిరుపతిలో ఉన్న అవకాశాలను వివరించారు.అదే విధంగా మంత్రి దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కాట లు కొత్త పెట్టుడుల ప్రతిపాదన, తిరుపతిని కొత్త ఎంఐసీఈ గమ్యస్థానంగా ప్రోత్సహించడం, కారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, హోమ్ స్టే, అడ్వెంచర్ టూరిజం, ఎక్స్ పీరియన్స్ సెంటర్స్ తో టూర్ ప్యాకేజీల అనుసంధానం, టూరిజం కొత్త పాలసీపై సమ్మిట్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్స్ తో, హోమ్ స్టే ఆపరేటర్స్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. పర్యాటక రంగ ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు.పెట్టుబడిదారులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు టూరిజం టీమ్ నిత్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తగిన ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.12,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు సాధించామంటే ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం స్పష్టమవుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ సందర్భంగా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడులతో రండి అని పర్యాటక పెట్టుబడిదారులకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు.కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో టెంపుల్ టూరిజంకు ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో ఈ తరహా రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లు నిర్వహించి స్థానికంగా పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను వెల్లడించామన్నారు. తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులకు ఆహ్వానించామన్నారు. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు.
రాయలసీమలో ప్రత్యేకించి తిరుపతిలో టెంపుల్ టూరిజంతో పాటు స్థానికంగా ఉన్న ప్రకృతి సౌందర్య ప్రాంతాలను, వాటర్ ఫాల్స్, టైగర్ రిజర్వ్, పర్యాటకులను ఆకర్షిస్తోన్న వివిధ పర్యాటక ప్రదేశాలను, పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కోటలకు విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. అంతేగాక వీటన్నింటిని కలిపి టూరిజం సర్క్యూట్ గా చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అందులో భాగంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్టణం, అరకువ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలో యాంకర్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఒకరోజు తిరుపతి దర్శనానికి వచ్చే భక్తుడు.. యాత్రికుడుగా మారి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా చంద్రగిరి పోర్ట్, శ్రీ వెంకటేశ్వర జువాలాజికల్ పార్క్, తలకోన జలపాతం, ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగిన సూళ్లూరుపేట, నేలపట్టులోని పక్షుల విహార కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా పర్యాటక పురోగతితో పాటు ఉపాధి అవకాశాలను బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. స్థానిక పర్యాటకులతో పాటు ఇతర ప్రాంత పర్యాటకులను ఆకర్షించే అంశంపై దృష్టిసారించామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పర్యాటక రంగం కుంటుపడటంతో ఏపీ నుండి ఇతర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లేవారని, కూటమి ప్రభుత్వంలో ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో పర్యాటకుల వసతికి అవసరమైన స్టార్ హోటళ్లు, రిసార్ట్ లు, కాటేజీల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
తిరుపతిని వ్యూహాత్మక పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం భావిస్తుందన్నారు. తిరుపతి నుండి సమీప ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక పెట్టుబడిదారులను ఆహ్వానించామన్నారు. అందులో భాగంగా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ద్వారా రూ.3482 కోట్ల విలువైన హాస్పిటాలిటీ ప్రాజెక్టులకు కేబినెట్ లో ఆమోదం లభించిందన్నారు. తద్వారా హోటళ్లలో 2698 రూమ్ లు ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. అంతేగాక దాదాపు 11,645 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.10,280 కోట్ల పర్యాటక పెట్టుబడులు వచ్చాయన్నారు. తద్వారా 1466 రూమ్ లు ఏర్పాటు కానున్నాయన్నారు. వీటన్నింటిని గ్రౌండింగ్ చేస్తున్నామన్నారు.
తిరుపతి సమీపంలో అట్ మోస్పియర్, నోవాటెల్, మారియట్, ఒబెరాయ్, లెమన్ ట్రీ, మహేంద్ర తదితర సంస్థలు రిసార్ట్స్, హోటళ్లు నిర్మించేందుకు ఎంఓయూలు చేసుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. దుబాయ్ తరహాలో మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ (మైస్) టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తిరుపతిలో డెస్టినేషన్ వెడ్డింగ్ లు సైతం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి పర్యాటకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టగలిగితే డెస్టినేషన్ వెడ్డింగ్ కు అవసరమైన కళ్యాణ మండపాలు, సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు అన్నట్లుగా క్యారవాన్ టూరిజంకు విస్తృత స్పందన వస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో క్యారవాన్ టూరిజం ఏర్పాటు చేయనున్నామన్నారు. తద్వారా పర్యాటకులకు వసతి సౌకర్యం కలుగుతుందన్నారు. రాయలసీమలోని శేషాచలం అడవుల్లో అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ తదితర ప్రక్రియను ప్రవేశపెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నామన్నారు. ఎర్రచందనం లభిస్తున్న ఈ ప్రాంతంలో ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నామన్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత అత్యధిక అడవులున్న ప్రాంతంగా పేరుగాంచిన తిరుపతి అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ శాఖతో ఈ విషయమై సమన్వయం చేసుకుంటామన్నారు. పర్యాటక అభివృద్ధి చేపట్టేందుకు ఇబ్బందులు లేకుండా పర్యాటక, అటవీ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకునేలా సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో 10,000 హోమ్ స్టేలు తీసుకొచ్చేందుకు హోమ్ స్టే పాలసీని తదుపరి కేబినెట్ లో ఆమోదింపజేస్తామన్నారు. పాలసీ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కేబినెట్ లో ఆమోదం పొందిన అనంతరం పోర్టల్ ను రూపొందిస్తామన్నారు. కోనసీమలో మండువా లోగిళ్లలో ఉండేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. అదే తరహాలో తిరుపతిలో పాతకాలం నాటి ఇళ్లలో, పురాతన కట్టడాలలో హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తామన్నారు. విదేశీ పర్యాటకులు హోమ్ స్టే లలో ఉండేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారని తెలిపారు.
స్పష్టమైనప్రతిపాదనలతో, ఆలోచనతో పర్యాటక అభివృద్ధి చేపట్టేందుకు ముందుకు వచ్చే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అవసరమైన భూమి, రాయితీలు,ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు త్వరితగతిన జారీ చేస్తామన్నారు. ఇన్వెస్టర్లపై భారం పడకుండా తక్కువ ఖర్చయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో పర్యాటక మంత్రి పర్యాటక అభివృద్ధి చేయలేకపోవడం వల్ల పర్యాటక రంగం కుంటుపడిందన్నారు. పర్యాటకాన్ని పట్టించుకోకపోవడం వల్ల రతనాలసీమగా ఉండాల్సిన రాయలసీమ ఎలా మారిందో చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక పెట్టుబడులు శూన్యమన్నారు. రుషికొండను మాత్రం రాజప్రాసాదంగా తీర్చిదిద్దారన్నారు.
కార్యక్రమంలో హోమ్ స్టే,పర్యాటక పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ఎండీ ఆమ్రపాలి కాట ఇన్వెస్టర్లకు వివరించారు.. స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ మెంట్, ల్యాండ్ కన్వర్షన్ చార్జీలు, క్వాలిటీ సర్టిఫికేషన్, పవర్ చార్జీలు, జీఎస్టీ తదితర అంశాలను వివరించారు.
ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట,జిల్లా అధికార యంత్రాంగం, నరసింహ యాదవ్, సుగుణమ్మ,డా.పసుపులేటి హరిప్రసాద్, టూర్ ఆపరేటర్స్ అసోయేషన్ అధ్యక్షులు విజయ్ మోహన్, సీఐఐ దామోదర నాయుడు, ఔత్సాహిక ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్