టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్‌–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం

- September 17, 2025 , by Maagulf
టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్‌–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం

సృజనాత్మక ఆలోచనతో రూపుదిద్దుకున్న రెస్టారెంట్ (కె.వి.ఎస్.సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మంది కోరుకుంటారు. కానీ అందరికీ ఆ అవకాశం రాకపోవచ్చు. అలాంటి వారికి అచ్చం విమాన ప్రయాణ అనుభూతి కలిగించే ప్రత్యేకమైన రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్, గండిమైసమ్మలో ఏర్పాటు చేశారు. ఇది “టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్”.

ఈ రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు పూర్తిగా విమాన ప్రయాణం చేసినట్లే అనిపిస్తుంది. లోపల ఫ్లైట్‌లో ఉండే సీట్లు, ఎయిర్‌ హోస్టెస్‌ వేషధారణలో సిబ్బంది, వెల్‌కమ్‌ డ్రింక్స్‌ అన్నీ నిజమైన ఫ్లైట్‌ అనుభూతిని కలిగిస్తాయి.

వెనుక కథ

పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్‌రెడ్డి తక్కువ ఖర్చుతోనే ప్రజలకు విమానం ఎక్కిన అనుభూతి కలిగించాలని అనుకున్నారు. అందుకోసం మలేషియాలోని ఓ స్క్రాప్‌ మార్కెట్‌ నుంచి రూ.35 లక్షలకు విమానం కొనుగోలు చేశారు. దానిని విడిభాగాలుగా తీసుకువచ్చి, రెస్టారెంట్‌గా మలిచారు. మొత్తం ప్రాజెక్ట్‌ మీద ఆయన రూ.50 లక్షలు ఖర్చు పెట్టారు.

రెస్టారెంట్‌ ప్రక్రియ

  • ఇక్కడ భోజనం చేయాలంటే సాధారణ రెస్టారెంట్‌లోలాగా కాకుండా, అచ్చం ఫ్లైట్‌లో ఎక్కే విధానం పాటించాలి.
  • మొదట పాస్‌పోర్ట్‌, వీసా చెకింగ్‌లా చెక్‌ చేసి, స్టాంపింగ్‌ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు.
  • బోర్డింగ్‌ పాస్‌ ఇస్తారు.
  • ఎక్కువ రద్దీ ఉంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెయిటింగ్‌ లాంజ్‌లో కూర్చోవచ్చు.
  • టోకెన్‌ నంబర్‌ వచ్చిన తర్వాత విమానం లోపలికి వెళ్లినప్పుడు ఎయిర్‌ హోస్టెస్‌లు స్వాగతం పలుకుతారు.
  • సీట్లో కూర్చున్న తర్వాత సీటుబెల్ట్‌ వేసుకోవాలని సూచించడం, వెల్‌కమ్‌ డ్రింక్‌ ఇవ్వడం, ఆర్డర్‌ చేసిన భోజనం అందించడం చేస్తారు.

ఫ్లైట్‌లో డోర్స్‌ క్లోజ్‌ అయినట్లు ఇక్కడ కూడా ఆ అనుభవాన్ని కల్పిస్తారు. కేవలం 45 నిమిషాల్లో భోజనం పూర్తి చేయాలి. చివరగా విమానం ల్యాండ్‌ అయినప్పుడు వినిపించే అనౌన్స్‌మెంట్‌తో భోజనం ముగుస్తుంది.

ప్రత్యేకతలు

  • దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన విమాన రెస్టారెంట్‌ ఇదే అని నిర్వాహకుడు వెంకట్‌రెడ్డి చెబుతున్నారు.
  • ఒక్కో వ్యక్తి నుంచి రూ.599 వసూలు చేస్తున్నారు.
  • మొత్తం 45 నిమిషాల పాటు విమానంలో ప్రయాణిస్తున్నట్లే అనుభవాన్ని ఇస్తుంది.

విమానంలో ఎక్కలేని వారికి ఇది ఓ ప్రత్యేకమైన అనుభవంగా మారింది. ఇప్పటికే ఇక్కడ భోజనం చేసిన వారు నిజంగా ఫ్లైట్‌ ట్రావెల్‌ చేసినట్లే అనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెస్టారెంట్ ఓనర్ గురించి...
ఇంతకీ వెంకట రెడ్డి దుబాయ్ లో 18 సంవత్సరాల పాటు హైదరాబాద్ ధం బిర్యానీ పేరుతో రెస్టారెంట్ నడిపారు. కరోనా కారణంగా దానిని మూసివేసి, ఇండియాకు వచ్చేసారు. అప్పటినుంచి ఏమి చేయాలన్నదే ఆయన ధ్యాస. అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తారు. కానీ సృజనాత్మకంగా చేయాలని ఆయన ఆలోచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com