రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..

- September 18, 2025 , by Maagulf
రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..

న్యూ ఢిల్లీ: ఓట్ల చోరీపై త్వరలోనే “హైడ్రోజన్ బాంబు” లాంటి విషయాలను వదులుతానని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన ఓట్ల చోరీపై కొన్ని విషయాలు ప్రకటించారు.

ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాగ్‌ చేస్తున్నారని చెప్పారు. అధికారులకు తెలియకుండా ఓట్లు ఎలా పోతాయని ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా కొన్ని వేల మంది ఓట్లను తొలగించారని అన్నారు.

కర్ణాటక అలంద్‌లో గోదాబాయి అనే మహిళ పేరుతో ఫేక్ లాగిన్‌ సృష్టించారని రాహుల్ గాంధీ తెలిపారు. గోదాబాయి మాట్లాడిన వీడియోను ఆయన ప్రదర్శించారు.

ఫేక్‌ లాగిన్ ఐడీలతో ఓట్లను తొలగించారని అన్నారు. ఓట్ల తొలగింపుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
“నేను ఇక్కడ చెబుతున్నవన్నీ 100 శాతం నిజాలే. నేను నా దేశాన్ని ప్రేమించే వ్యక్తిని, నా రాజ్యాంగాన్ని ప్రేమిస్తాను, ప్రజాస్వామ్య విధానాన్ని ప్రేమిస్తాను, ఆ విధానాలను రక్షిస్తున్నాను” అని తెలిపారు.

కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తమను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు.

“అలంద్‌లో ఓటర్లుగా 6,018 మంది నుంచి దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ దరఖాస్తులు చేసుకున్నవారు నిజానికి ఓ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వాటిని ఆటోమేటిక్‌గా చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మొబైల్ నంబర్లు ఉపయోగించి, అలంద్‌లో నంబర్లను డిలీట్ చేశారు. కాంగ్రెస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు” అని తెలిపారు.

మహారాష్ట్రలోనూ 6,850 నకిలీ ఓట్లను చేర్చారని రాహుల్ గాంధీ తెలిపారు. ఓట్లను చోరీచేసిన వారిని సీఈసీ జ్ఞానేశ్ కుమారే రక్షిస్తున్నారని ఆరోపించారు. ఓట్లను చోరీ చేసిన వారిని కాపాడే ధోరణిని వదులుకోవాలని తాను ఈసీని కోరుతున్నానని అన్నారు.

దేశ వ్యాప్తంగా లక్షల మంది ఓట్లలో మార్పులు, చేర్పులు జరిగాయని చెప్పారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, ఓబీసీల ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com