ఏపీకి కొత్త అసెంబ్లీ భవనం

- September 25, 2025 , by Maagulf
ఏపీకి కొత్త అసెంబ్లీ భవనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా, శాసనసభ ప్రాంగణంలో రూ.3.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రానికి శాశ్వత, పూర్తిస్థాయి అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నూతన భవనాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, దీని మొదటి అంతస్తును విప్‌లకు కేటాయించామని తెలిపారు. త్వరలోనే ఇక్కడ మీడియా పాయింట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మంత్రి నారాయణ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ భవనాన్ని మొదట రూ.5 కోట్ల అంచనాలతో ప్రారంభించినప్పటికీ, కేవలం రూ.3.50 కోట్లతోనే పూర్తి చేశామని వెల్లడించారు. గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిర్మాణం ఆలస్యమైందని ఆయన తెలిపారు.

త్వరలో కొత్త అసెంబ్లీ ప్రధాన భవనం నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, వాటిని త్వరలో ప్రజల ముందు ఉంచుతామని ఆయన చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, శాసనసభ అవసరాలకు అనుగుణంగా చేపట్టే నిర్మాణాలకు నిధుల కొరత లేదని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com