తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం

- September 29, 2025 , by Maagulf
తానా ఆధ్వర్యంలో \'ప్రతిభామూర్తులు\' సభ విజయవంతం

డాలస్, టెక్సస్:  తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 84వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం పద్మవిభూషణ్ డా. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన “తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు” అనే అంతర్జాల సమావేశం విజయవంతంగా జరిగింది.

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులను ఆహ్వానించి సభను ప్రారంభిస్తూ తెలంగాణా గడ్డపై జన్మించిన ఎంతోమంది సాహితీవేత్తలు విశేష కృషి చేశారని, కాళోజీ జయంతి సందర్భంగా వారిలో కొంతమందిని ఈ రోజు స్మరించుకోవడం ఆనందదాయకం అన్నారు.  

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తెలుగునేలపై ప్రభవించిన ప్రతిభావంతులు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనేగాక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య, సంగీత, విద్యా, వైజ్ఞానిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక, సినీ, రాజకీయ, క్రీడా, సేవా రంగాలలో కీర్తి గడించినప్పుడు ప్రాంతాలకతీతంగా ప్రతి తెలుగుగుండె గర్వంతో ఉప్పొంగుతుంది. తెలంగాణ ప్రాంతంలో జన్మించి సాహిత్యరంగంలో విశేష కృషిచేసిన వారిలో కొంతమందిని తెలంగాణా రాష్ట్ర తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్మరించుకుని ఘన నివాళులర్పించుకోవడం సముచితమైనది, సందర్భోచితమైనది అన్నారు. వీరు చేసిన సాహిత్య కృషి భావి తరాలకు స్పూర్తిదాయకమైనది అన్నారు”.  

ముఖ్యఅతిధిగా హాజరైన ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య (పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్) పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు బహుభాషా పండితులని, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై ముఖ్యంగా నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్షర పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన ప్రజాకవి అని ప్రస్తుతించారు.    

విశిష్టఅతిథులుగా విచ్చేసిన - డా. జుర్రు చెన్నయ్య (ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సారస్వతపరిషత్తు ప్రధాన కార్యదర్శి కావేరమ్మపేట, మహబూబానగర్ జిల్లా) - ప్రముఖ పాత్రికేయుడు, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత అయిన డా. దేవులపల్లి రామానుజరావు గురించి; డా. కెడిడి మృణాళిని ( ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, హైదరాబాద్) - ప్రముఖ సాహితీవేత్త, జానపద విజ్ఞాన పరిశోధకుడు అయిన ఆచార్య డా. బిరుదురాజు రామరాజు గురించి; రంగరాజు పద్మ (రచయిత్రి, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా, ఒద్దిరాజు రాఘవ రంగారావుగారి కుమార్తె)-ప్రముఖ సాహితీవేత్తలు శ్రీయుతులు ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు, రాఘవ రంగారావుల గురించి; డా.వి.జయప్రకాష్ (ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, దేవుని తిర్మలాపురం, నాగర్ కర్నూలు జిల్లా)-ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు  దాశరథి రంగాచార్యుల గురించి; డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు (ప్రముఖ రచయిత, విమర్శకులు, కరీంనగర్)–ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు డా. కపిలవాయి లింగమూర్తి గురించి;డా.బ్రాహ్మణపల్లి జయరాములు (అధ్యాపకులు, సాహితీవేత్త, హైదరాబాద్)-అభినవ పోతన, ఉద్ధండ పండితుడు అయిన డా. వానమామలై వరదాచార్యుల గురించి; శ్రీధర్ రావు దేశ్ పాండే (ప్రముఖ రచయిత, బోథ్, ఆదిలాబాద్ జిల్లా) - తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు అయిన డా. సామల సదాశివ గురించి;  డా.కొండపల్లి నీహారిణి (ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, హైదరాబాద్, కొండపల్లి శేషగిరిరావు కోడలు) - సుప్రసిద్ద చిత్రకారుడు అయిన డా. కొండపల్లి శేషగిరిరావు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుని, ఈ లబ్ధప్రతిష్టులైన జీవితాలను అద్భుతంగా ఆవిష్కరించి నివాళులర్పించారు.  

పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలో వీక్షించవచ్చును.

https://youtube.com/live/nB5Pw6gfuhs

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com