నేడు హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం

- September 29, 2025 , by Maagulf
నేడు హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: హైదరాబాద్ లోని పేద ప్రజలకు, రోజువారీ కూలీలకు బస్తీ ప్రాంతాల నివాసితులకు తెలంగాణ ప్రభుత్వం మరో గొప్ప పథకం తీసుకువచ్చింది. (నేడు) సెప్టెంబర్ 29 నుండి నగరంలోని పేదల కోసం ప్రత్యేకంగా ₹5కే టిఫిన్ అందించే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కానుంది.. ఈ పథకం ద్వారా పేదలు అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని పొందవచ్చు.

జీహెచ్‌ఎంసీ, హరేకృష్ణ ఫౌం డేషన్ సహకారంతో నడుస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లద్వారా ఈ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను అందుబాటులోకి తేనుంది.మొదటి దశలో నగరంలోని 60 ప్రాంతాల్లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ టిఫిన్ కార్యక్రమం నేటి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత, నగర వ్యాప్తంగా ఉన్న మొత్తం 150 ఇందిరమ్మ క్యాంటీన్లకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు.

రోజుకు సుమారు 25 వేల మందికి కేవలం రూ.5కే టిఫిన్‌ను అందించాలని జీహెచ్‌ఎంసీ (GHMC) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంటీన్లు వారానికి ఆరు రోజులు తెరిచి ఉంటాయి. ఆదివారం మాత్రం క్లోజ్ చేస్తారు.నగరవాసులకు ఆరోగ్యకరమైన అల్పాహారం అందించడానికి, మెనూలో మిల్లెట్ (చిరుధాన్యాల) టిఫిన్లకు ప్రాధాన్యత ఇచ్చారు.

మెనూలో రోజూ ఒక వెరైటీ ఉండేలా..ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ వంటి వంటకాలను చేర్చారు. ఈ పథకానికి సంబంధించి ఆర్థిక భారంలో సింహభాగాన్ని జీహెచ్‌ఎంసీ (GHMC) భరించనుంది. ఒక్కో టిఫిన్‌ తయారీకి అయ్యే అసలు ఖర్చు దాదాపు రూ.19 వరకు అవుతుంది.

దీనిలో లబ్ధిదారుల నుంచి కేవలం రూ.5 మాత్రమే తీసుకుంటారు. మిగిలిన రూ.14 ఖర్చును జీహెచ్‌ఎంసీ సబ్సిడీ రూపంలో భరిస్తుంది.పేదవారి ఆకలి తీర్చే లక్ష్యంతో నగరంలో గత ప్రభుత్వం రూ.5 భోజన కార్యక్రమం ప్రారంభిచింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత..రూ.5కే భోజనం అందిస్తున్న పాత అన్నపూర్ణ క్యాంటీన్ల స్టాల్స్‌ను అధికారులు ఆధునీకరించి వాటికి ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’గా నామకరణం చేశారు.

గతంలో GHMC పరిధిలో 139 క్యాంటీన్లు ఉండగా.. తాజాగా వాటి సంఖ్యను 150కి పెంచారు.నాణ్యమైన భోజనాన్ని రూ.5కే అందిస్తున్న హరే రామ హరే కృష్ణ మూవ్‌మెంట్ (హరేకృష్ణ ఫౌండేషన్) తోనే, టిఫిన్ పథకం కోసం కూడా బల్దియా మరోసారి ఒప్పందం చేసుకుంది.

బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ టిఫిన్ స్కీమ్ ఒక గొప్ప వరంగా మారనుంది. ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com