ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- September 29, 2025
దుబాయ్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అయిన తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు తేదీ 28 సెప్టెంబర్ ఆదివారం రోజున దుబాయ్ లోని అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ ఆడిటోరియంలో భారీ జన సందోహం నడుమ ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు వెల్ఫేర్ సంఘం( ETCA) ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు ఎంతో అట్టహాసంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ లోకసభ సభ్యురాలు డి.కె అరుణ, మెదక్ లోకసభ సభ్యులు శ్రీమాధవనేని రఘునందన్ రావు మరియు గౌరవ అతిథులుగా కాన్సులేట్ జనరల్ సతీష్ కుమార్ శివన్, కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా ప్రముఖ తెలంగాణ జానపద గాయనిలు మధుప్రియ, ముకుంద అలాగే ఫోక్ డాన్సర్స్ మౌనిక డింపుల్, లాస్య స్మైలీ మరియు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
దుబాయ్ లోని అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 5000 పైగా తెలంగాణ ప్రవాసియులు పాల్గొన్న ఈ వేడుకల్లో ఉదయం నుండి మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమ వేదికలోనే ఆడపడుచులు రంగు రంగు పూలతో బతుకమ్మలను పేర్చారు, సప్తవర్ణల శోభితిమైన పూలదొంతరుల బతుకమ్మలు చూడముచ్చటగా కనిపించాయి.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులు సాంప్రదాయ బతుకమ్మ పాటలు మరియు చప్పట్ల తో మారుమోగింది.కళాకారుల డప్పు వాయిద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొనగా మహిళలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటల, కోలాటాల నృత్యాల నడుమ వేడుక ప్రాంగణం పులకించింది. బతుకమ్మ పండుగ నేపధ్యం పై ప్రదర్శించిన జానపద సాంస్కృతిక నృత్య పోటీలు, చిన్న పిల్లల సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు అందరిని అలరించడం విశేషం, హాజరైన మహిళలకు బతుకమ్మ ప్రసాదం, 5000 మందికి భోజనాలు ఏర్పాటు చేసారు నిర్వాహకులు, ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర మరియు అధ్యక్షులు జగదీష్ రావు చీటీ మాట్లాడుతూ 2011 నుండి క్రమం తప్పకుండా యూఏఈ గడ్డ మీద వందల మందితో ప్రారంభమైన మొదటి బతుకమ్మ ఈ రోజు వేలాది మంది తెలంగాణ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఇలాంటి వేడుకలు మన సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతి ని తెలియ చెప్పేలా ఇలాంటి కార్యక్రమాలు దోహద పడుతాయని, అలాగే ETCA అధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ యూఏఈలో ఉన్న తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, ఆపదలో ఉన్న తెలంగాణ బిడ్డలకు చేతనైనింత సహాయాన్ని అందించటం ETCA ఉద్దేశమని మరియు గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మా గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ETCA ఆద్వర్యం లో భారీ ఎత్తున నిర్వహించబడిన బతుకమ్మ సంబరాలు చూసి అలాగే 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండ ఈ వేడుకలను నిర్వహిస్తున్న ETCA వారి కృషిని అభినందించారు. ETCA సలహాలు సూచనలు తీసుకొని గల్ఫ్ కార్మికుల సమస్యలను మా తరపున ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. అరబ్ దేశంలో బతుకమ్మ పండుగను నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగించిందని, ఇలాంటి సాంస్కృతిక పరమైన వేడుకలు భావితరాలకు మన ఆచార సంప్రదాయాలను తెలియచేయడానికి దోహదపడుతాయని వారు కొనియాడారు మరియు ఈ మెగా బతుకమ్మ సంబరాలకు మమ్మల్ని ఆహ్వానించిన ETCA కార్యవర్గానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జానపద గాయినిలు మధుప్రియ, ముకుంద పాడిన బతుకమ్మ పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసాయి.ఫోక్ డాన్సర్ మౌనిక డింపుల్ మరియు స్మైలీ లాస్య ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.చిన్నపిల్లలు సైతం సాంప్రదాయ దుస్తుల్లో “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ చప్పట్లతో హుషారుగా ఆడిపాడటం అందరిని ఆకట్టుకొన్నాయి.
కార్యక్రమానికి హాజరైన మహిళలందరు కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ కు తలమానికమైన బతుకమ్మ సంబరాలను గొప్పగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మహిళలు తీసుకొచ్చిన రంగు రంగు పూల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. ETCA మహిళ విభాగం సభ్యులు చే ప్రత్యేకంగా తయారుచేసిన అతి పెద్ద బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు అందమైన బతుకమ్మలను ఎంపిక చేసి, బతుకమ్మ పాటల పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ETCA మహిళా సభ్యులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు–బతుకమ్మ కోలాటాలు, జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “వెళ్లి రావమ్మ బతుకమ్మ” అంటూ గౌరమ్మను తలుస్తూ బతుకమ్మలను ఏర్పాటు చేసిన కొలనులో నిమ్మర్జనం చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదంను అందించారు.
ఈ సంబరాల్లో ETCA వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షులు జగదీష్ రావు చీటీ , జనరల్ సెక్రటరీ రాణి కోట్ల, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అలిగేటి, జాయింట్ సెక్రటరీ శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వినోద్ ఆచార్యులు , సారిక పీచర , అన్నపూర్ణ , సామ శ్రీనివాస్ రెడ్డి, రఘు అలిగేటి, రమణ స్వర్గం , రాము కందుకూరి, సంతోష్ కుమార్, మధు కుమార్, రాజేష్ పోలంపల్లి, వనజ,రాము జల, మమత కస్తూరి , కార్తీక్ రెడ్డి, అజహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
\
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు