ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!

- September 30, 2025 , by Maagulf
ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!

జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను యూరోపియన్ మరియు మధ్యప్రాచ్య నాయకులు స్వాగతించారు. ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అంగీకరించిన ఈ ప్రణాళికను హమాస్ అంగీకరించాలన్నారు.  పోరాటాన్ని వెంటనే ముగించాలని, హమాస్ వద్ద ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని, చనిపోయినట్లు భావిస్తున్న 20మందికి పైగా బందీల అవశేషాలను 72 గంటల్లోపు అందజేయాలని ప్రతిపాదించారు. అందుకు బదులుగా ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న  వందలాది మంది గాజావాసులను విడుదల చేయాలని నిర్ణయించారు. 

అయితే, గాజాను పరిపాలించడంలో హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండదని ఈ ప్రణాళికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆ వార్తలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. వైట్ హౌస్ లో "శాంతి కోసం ఒక చారిత్రాత్మక దినం" అని ట్రంప్ అభివర్ణించారు. కానీ హమాస్ ఈ ప్రణాళికకు అంగీకరించకపోతే హమాస్ ను నాశనం చేసే పనిని పూర్తి చేయడానికి నెతన్యాహుకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన హెచ్చరించారు.

 అనంతరం నెతన్యాహు పాలస్తీనా రాజ్యంపై తన దీర్ఘకాల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఒప్పందంలో లేదని, తాము పాలస్తీనా రాజ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 

కాగా, గాజాలో యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ నాయకత్వాన్ని, ఆయన నిజాయితీ ప్రయత్నాలను ప్రశంసిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, టర్కీ, ఇండోనేషియా మరియు పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.  పాలస్తీనాలో శాంతి నెలకొనడానికి అమెరికాతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. గాజా శాంతికి నిజమైన అవకాశం ఇవ్వడానికి అన్ని పార్టీలు ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు.         

2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా ఉన్నారు.  అయితే,  ఇజ్రాయెల్ దాడుల్లో 66,055 మంది మరణించారని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com