ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్

- October 01, 2025 , by Maagulf
ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సౌకర్యార్థం నూతన వ్యవస్థను అమలు చేయబోతున్నారు. రేపటి నుంచే ఈ–అరైవల్ కార్డ్ సిస్టమ్ అమల్లోకి రానుంది. ఇప్పటివరకు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు పేపర్ ఫారమ్‌లలో తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసేవారు.ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం పట్టటమే కాకుండా క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండేది. ఇకపై ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోకి రాకముందే ఆన్‌లైన్‌లో డీటైల్స్ నింపి సబ్మిట్ చేసే అవకాశం పొందుతారు.దీంతో పేపర్ వాడకాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ కొత్త వ్యవస్థతో ప్రయాణికులు తమ వివరాలను మూడు రోజుల ముందుగానే సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే విమాన ప్రయాణానికి సిద్ధమయ్యే సమయంలోనే ఈ–అరైవల్ కార్డ్  ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపి పంపితే, ఎయిర్‌పోర్టులో మళ్లీ ఫారమ్ నింపే ఇబ్బంది ఉండదు. క్యూలు తగ్గడంతో భద్రతా తనిఖీలకు కూడా సమయపాలన సాధ్యమవుతుంది. పేపర్ వాడకం తగ్గడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. పేపర్‌లెస్ సిస్టమ్‌తో డేటా ఎంట్రీ లోపాలు తగ్గి, సమాచారం తక్షణమే అధికారులు చూసే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా వంటి దేశాల్లో ఈ–అరైవల్ సిస్టమ్ విజయవంతంగా అమలవుతోంది. ఆ దేశాల మాదిరిగా భారత దేశంలో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన అడుగుగా భావించవచ్చు. దీనివల్ల దేశంలోకి వచ్చే విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలకు కూడా సౌకర్యం కలుగుతుంది. ఆధునిక సాంకేతికతతో సమయాన్ని, వనరులను ఆదా చేసుకోవడం ద్వారా ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ వ్యవస్థ లక్ష్యం.ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఈ చర్యతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులకు ఆదర్శంగా నిలవనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com