మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?

- October 10, 2025 , by Maagulf
మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?

విశాఖపట్నం: గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రుషికొండ పై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో రిషికొండపై నిర్మించిన భారీ భవనాన్ని వినియోగానికి అధ్యయనం చేసి, సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే.

మంత్రివర్గ ఉపసంఘంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిలు ఉన్నారు. ఈ మంత్రి వర్గ ఉపసంఘానికి కన్వీనరుగా పర్యాటక, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. అయితే, తాజాగా.. సచివాలయంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీఎస్బీవీ స్వామి, కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రుషికొండ ప్యాలెస్‌ను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై చర్చ జరిగింది. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ ప్యాలెస్ వల్ల నెలకు రూ.25లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని సమావేశంలో చర్చకు వచ్చింది. గతంలో రూ.7కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులు ఎలా అధిగమించాలనే అంశంపై మంత్రులు చర్చించారు. అయితే, రుషికొండ ప్యాలెస్ ఏ విధంగా వినియోగించాలనే విషయంపై ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని, తద్వారా దానిని ప్రజాప్రయోజనకరంగా వినియోగించాలని సబ్ కమిటీ సిఫార్సులు చేసింది.

ఆర్థిక రంగానికి హోటల్ నిర్వహణ, మానసిక వికలాంగుల చికిత్సాలయ ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు, సలహాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. అయితే, ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. రుషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకు రావడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేసి.. త్వరలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదికను కేబినెట్ సబ్ కమిటీ సమర్పించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com