‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం

- October 17, 2025 , by Maagulf
‘శ్వాస స్వర సంధ్య\' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం

డాలస్, అక్టోబర్ 12: డాలస్ నగరంలో ఆదివారం సాయంత్రం, భావప్రధానమైన సంగీతంతో, శ్రుతి-లయల అద్భుత సమన్వయంతో డా. కొమరవోలు శివప్రసాద్ ఈలపాట సంగీత విభావరి, సంగీతాభిమానులైన ఆహూతులకు ఒక గొప్ప రసానుభూతిని కలిగించింది.

కాపెల్‌లోని పింకర్టన్ ఎలిమెంటరీ స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో, "విజిల్ విజర్డ్" (Whistle Wizard) గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పద్మశ్రీ, కళారత్న డా. కొమరవోలు శివప్రసాద్ తన ఈలపాటతో శ్వాసస్వర మాధుర్యాన్ని పంచి, సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు.

ఎటువంటి ముందు పరిచయం లేకుండా, ఒక్క రిహార్సల్ కూడా లేకుండా నేరుగా ఈ కచేరీలో సహాయక వాయిద్యకారులుగా చేరిన రామకృష్ణ గడగండ్లకు, నిండు సరస్వతీ కటాక్షం సంపాదించుకున్న చిరంజీవి చిదాత్మ దత్త చాగంటికి, చిరంజీవి స్వప్నతి మల్లజోస్యులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియశారు.

ప్రముఖ ట్రావెల్స్ సంస్థ వోల్డీలక్స్, ఇన్సూరెన్స్ సంస్థ SNR ఇన్సూరెన్స్,  సిలికానాంధ్ర మనబడి డాలస్ జట్టు సభ్యులు సంయుక్తంగా ఈ సంగీత వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు.

బాల్యంలోనే ఈలపాట రఘురామయ్య గారి సాహచర్యం, ఆ తర్వాత సంగీతసమ్రాట్ పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యరికంతో డా. శివప్రసాద్ సంగీతంలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. ఎక్కువమంది చేపట్టడానికి సాహసించని ఈ అరుదైన "శ్వాసాధార సంగీత" ప్రక్రియపై ఆయన పరిశోధన చేసి, దానిని పరిపుష్టం చేశారు. ప్రతిరోజూ ఐదు గంటలకు పైగా సాధన చేస్తూ, ఉచ్ఛ్వాస-నిశ్వాసాలను నియంత్రించి, గుక్కతిప్పుకోకుండా సంగీతాన్ని సృష్టించే ఒక విశిష్ట శైలిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు.

ఈ కచేరీలో ఆయన త్యాగరాజ కీర్తనలు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనల నుండి శక్తివంతమైన "భో శంభో శివ శంభో" భక్తి గీతం వరకు, శంకరాభరణం రాగంలోని తిల్లానాల వరకు ఎన్నో ప్రఖ్యాత గీతాలను తన ఈలపాటలో అలవోకగా పలికించారు. ఆయనకు తోడుగా డాలస్‌కు చెందిన యువ కళాకారులు తబలా, వయోలిన్, మృదంగంపై అద్భుతమైన స్వరసమరస్యాన్ని ప్రదర్శించి, కచేరీ స్థాయిని మరింత పెంచారు. ప్రతి కీర్తన ముగిసినప్పుడు సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. కార్యక్రమం ముగింపులో, దాదాపు రెండు వందల మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో తమ అపారమైన ఆనందాన్ని, కళాకారుడి పట్ల తమకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. డా. ప్రసాద్ తోటకూర, శ్రీ శ్రీకాంత్ బొర్రా దంపతులు, శారద, భాస్కర్ రాయవరం కళాకారులకి గౌరవ సత్కారాలని అందించారు. ప్రసాద్ జోస్యుల సభకు అధ్యక్షత వహించారు. రమేశ్ నారని,  రంగాల మన్మధ రావు సాంకేతిక సహకారం అందించారు. సూర్యనారాయణ విష్ణుభొట్ల ఆడిటోరియం సదుపాయాలు, ఏర్పాట్లు, సమయపాలనలో సహాయం చేశారు. కాపెల్‌ విద్యాలయం అడ్మిన్ జట్టు సహకారం వల్ల మంచి సదుపాయాలతో కూడిన ప్రాంగణం ఈ సంగీత కచేరి చక్కగా జరగడానికి దోహదపడింది. 'పద్మశ్రీ', 'కళారత్న' పురస్కారాలు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు, మరియు ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఘనత డా. శివప్రసాద్ సంప్రదాయ సంగీతానికి ఆధునికతను జోడించి, "శ్వాసలో సంగీతం" అనే కొత్త స్ఫూర్తిని ఆయన ప్రపంచానికి అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com