ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం

- October 23, 2025 , by Maagulf
ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం

వైద్యారోగ్య రంగంలో పెట్టుబడి పెట్టాలని బుర్జిల్ సంస్థను కోరిన సీఎం

దుబాయ్: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానాలకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా స్పందిస్తున్నారు. యూఏఈలో మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు దుబాయ్ లో బుధవారం పర్యటించిన చంద్రబాబు..అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలిల్‌తో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ క్రమంలో షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగంలో పేరొందిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్‌కు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై సీఎం వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని..పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంతోపాటు... షిప్ బిల్డింగ్ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్టు సీఎం ఆ సంస్థ ఛైర్మన్ రామకృష్ణన్‌కు తెలిపారు. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మించే దిశగా ప్రణాళికలు  చేస్తున్నట్టు వివరించారు. దీనిపై ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించింది. ఏపీలో షిప్ బిల్డింగ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లాజిస్టిక్స్ వ్యయం తగ్గించే ఆలోచనలతో తాము పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు సీఎం చెప్పారు. రైలు, పోర్టులు, ఎయిర్ పోర్టుల కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. 

వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం

అబుదాబిలోని వైద్యారోగ్య రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఆ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థ ఆసక్తి కనబరిచింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌పై తమ సంస్థకు విశేషమైన అనుభవం ఉందని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. బుర్జిల్ సంస్థ ఛైర్మన్‌తో భేటీలో భాగంగా వైద్యారోగ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను సీఎం వివరించారు. వైద్యారోగ్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ అనే విధానాన్ని అవలంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజటలీకరణ ప్రాజెక్టును పైలెట్ గా చేపట్టినట్టు చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తో పాటు పరిశ్రమలశాఖ, ఈడీబీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com