ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!

- October 23, 2025 , by Maagulf
ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!

హైదరాబాద్: ప్రస్తుత వేగవంతమైన యుగంలో చెయ్యెత్తి బస్సు ఆపని ఈ రోజుల్లో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) వినూత్న మార్పుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు కొత్త పద్ధతిని ప్రారంభించారు — బస్సులో ఎక్కిన ప్రతి ప్రయాణికుడిని “స్వాగతం… సుస్వాగతం” అంటూ ఆత్మీయంగా పలకరించడం.

ఈ ప్రత్యేక ఆచరణ ప్రయాణికుల్లో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ప్రయాణంలో రద్దీ, ఒత్తిడి, అనాసక్తత కనిపించే చోట ఇప్పుడు ఆత్మీయత, మర్యాద కనిపించడం ఈ కొత్త ప్రయత్నం ద్వారా సాధ్యమైంది.

TSRTC మేనేజ్మెంట్ సూచనల మేరకు, ప్రతి బస్సు ప్రయాణం ప్రారంభించే ముందు డ్రైవర్ లేదా కండక్టర్ ప్రయాణికులను ఉద్దేశించి స్వాగతం పలుకుతున్నారు. బస్సు గమ్యస్థానం, ప్రయాణ సమయం వంటి వివరాలను తెలియజేస్తూ, ఆర్టీసీ సేవలను ఉపయోగించినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అదే సమయంలో, సురక్షితమైన మరియు సుఖవంతమైన ప్రయాణానికి RTC తీసుకుంటున్న కృషిని వివరించి, ప్రయాణికులను ప్రభుత్వ రవాణా సేవలను ఆదరించమని కోరుతున్నారు. ఈ చర్యతో RTC పట్ల ప్రజల్లో నమ్మకం, ఆప్యాయత పెరుగుతోంది.

గతంలో కొందరు డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తనపై ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ దృశ్యం మారింది. ప్రయాణికులను ఆప్యాయంగా పలకరిస్తూ, బస్సులో సౌకర్యవంతమైన వాతావరణం సృష్టించడం RTC సిబ్బంది కొత్త సంస్కృతిగా మారుతోంది. ఈ మార్పు కేవలం మానవ సంబంధాలకే కాకుండా, సంస్థ ప్రతిష్టకు కూడా పెద్ద పాజిటివ్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతోంది. ప్రయాణికులు కూడా RTC సిబ్బంది మారిన తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com