బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం

- October 24, 2025 , by Maagulf
బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం

కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో ఓ స్కూటర్‌ను ఢీకొనింది. దీంతో ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో బస్సు మెుత్తానికి మంటలు వ్యాప్తిచెందాయి. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు మరణించగా 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్టు సమాచారం.

బస్సు దగ్ధమైన ఘటన కలిచివేస్తోంది. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపే ఘోర విషాదం జరిగిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ అగ్నికి ఆహుతి అయిపోయారు. 12 మంది ప్రయాణికులు కిటికీలు బద్దలు గొట్టుకుని ప్రాణాలతో బయటపడగా 25 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్లు పరారయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి అధికారులు ఈ ప్రమాదం గురించి తెలియజేశారు. వెంటనే సీఎం సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కర్నూలు బస్సు ప్రమాదంపై కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అతి వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు, డోర్ వద్ద మంటలు చెలరేగాయి. ప్రయాణికులు మంటల నుంచి బయటపడేందుకు వీలు లేకపోవటంతో ఎమర్జన్సీ, కిటీకీలు పగలగొట్టుకుని గాయాలతో ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఘటన తర్వాత పరారయ్యారు. మృతుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com