విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!

- October 28, 2025 , by Maagulf
విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!

చికాగో: చికాగో నుంచి జర్మనీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు భయంకర ఘటనకు కారణమయ్యాడు. 28 ఏళ్ల ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి అనే వ్యక్తి విమాన ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా రెండు టీనేజర్లపై మెటల్ ఫోర్క్‌తో దాడి చేశాడు. ఆ సమయంలో 17 ఏళ్ల యువకుడు నిద్రిస్తున్నాడు. అతడి భుజంపై పొడవగా, పక్కనే కూర్చున్న మరో 17 ఏళ్ల కుర్రాడిపై కూడా దాడి చేసి తల వెనుక భాగంలో గాయం చేశాడు.

ఈ దాడిని చూసిన ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా ప్రణీత్ మరింత హింసాత్మకంగా ప్రవర్తించాడు. ఒక మహిళా ప్రయాణికుడిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

అత్యవసర ల్యాండింగ్ – నిందితుడి అరెస్ట్
లుఫ్తాన్సా విమానంలో పరిస్థితి అదుపు తప్పడంతో పైలట్లు తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని బోస్టన్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే అమెరికా భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి నిందితుడు ప్రణీత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్‌పై “ప్రమాదకర ఆయుధంతో విమానంలో దాడి చేయడం” అనే ఫెడరల్ నేరం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అతడు గతంలో స్టూడెంట్ వీసాతో అమెరికాకు వచ్చి మాస్టర్స్ చదివాడని, ప్రస్తుతం అతడి వీసా చెల్లుబాటు కాలేదని తేలింది.

తీవ్ర శిక్ష ఎదురవచ్చే అవకాశం
ప్రణీత్‌పై ఉన్న అభియోగాలు రుజువైతే, అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా $2,50,000 జరిమానా విధించే అవకాశం ఉంది. విమాన భద్రతను కాపాడడంలో అమెరికా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయ విమానాల్లో మానసిక స్థితి పరిశీలన వంటి అంశాలపై మరలా చర్చ మొదలైంది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com