2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం

- October 31, 2025 , by Maagulf
2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఆయన అమలు చేస్తున్న విధానాలు మరింత కఠినతరంగా మారాయి. ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయ పౌరులపై కూడా ఈ ప్రభావం పడింది.

అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయులను ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు స్వదేశానికి పంపించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కీలక గణాంకాలను వెల్లడించారు.

ఈ సందర్భంగానే ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. “ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు అమెరికాలో ఉండటానికి కావలసిన అర్హత ప్రమాణాలను పాటించని, అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు” అని తెలిపారు.

బహిష్కరణ ప్రక్రియ గురించి వివరిస్తూ.. విదేశాల్లో అక్రమంగా నివసిస్తున్న వారి ధ్రువపత్రాలను, జాతీయతను క్షుణ్ణంగా పరిశీలించి అది ధ్రువీకరించబడిన తర్వాతే వారిని తిరిగి దేశానికి తీసుకు వస్తున్నామని చెప్పారు.

ఈ 2,790 మందికి పైగా పౌరులు అక్టోబర్ 29వ తేదీ వరకు స్వదేశానికి తిరిగి వచ్చారని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.అమెరికన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ భారీ సంఖ్యలో బహిష్కరణలు చోటుచేసుకున్నాయి.

ఉపాధి వీసా (H-1B), విద్యార్థి వీసా, టూరిస్ట్ వీసా గడువు ముగిసినా లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా.. అక్రమంగా సరిహద్దు దాటినా ఇలాంటి బహిష్కరణలు జరుగుతున్నాయి. ఇన్ని వేల మంది భారతీయులు ఒకే సంవత్సరంలో స్వదేశానికి తిరిగి రావడం చూస్తుంటేనే.. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనల అమలు ఎంత కఠినంగా ఉందో తెలియజేస్తోంది.

అయితే అమెరికాతో పాటు ఈ సంవత్సరం యునైటెడ్ కింగ్‌డమ్ (UK) నుంచి బహిష్కరించబడిన భారతీయుల సంఖ్య గురించి కూడా ప్రతినిధి జైస్వాల్ వివరించారు. “యూకే నుంచి ఈ ఏడాది సుమారు 100 మంది భారతీయ పౌరులు బహిష్కరించబడ్డారు. వారి జాతీయతను కూడా మా ద్వారా ధ్రువీకరించిన తర్వాతే యూకే ఈ చర్యలు తీసుకుంది” అని ఆయన తెలిపారు.

అలాగే భారత ప్రభుత్వం తమ పౌరుల జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ.. ఈ అంతర్జాతీయ బహిష్కరణ ప్రక్రియ సక్రమంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగేలా చూస్తోందని కూడా రణదీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com