రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- November 03, 2025
తెలంగాణ: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 70మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు.. ఈ ప్రమాదంలో 19మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల – వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
మూలమలుపు వద్ద బస్సుతోపాటు కంకర లోడుతో టిప్పర్ లారీ వేగంగా రావడంతో అదుపు తప్పి బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ క్రమంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. లారీలోని కంకర బస్సుపై పడడంతో బస్సులోని కొందరు ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి కంకర కింద కూరుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 20మృతదేహాలను వెలికి తీశారు. పలువురికి తీవ్ర గాయాలుకాగా వారికి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతుల్లో 11 మంది మహిళలు, 9మంది పురుషులు ఉన్నారు. మూడు నెలల పసికందు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కొందరు ప్రయాణికులు కంకరలో సగం వరకు కూరుకుపోయి తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ లారీ డ్రైవర్ మూలమలుపులో వేగంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు పేర్కొంటున్నారు. మృతుల్లో ఎక్కువగా డ్రైవర్ వెనుక భాగంలో సీట్లలో కూర్చుకున్న వారే ఉన్నారు.
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిని హైదరాబాద్ తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలానికి చేరుకోవాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను పొన్నం ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ కు పొన్నం ఆదేశించారు.
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







