సినిమా రివ్యూ: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.!
- November 27, 2025
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో వచ్చిన సినిమానే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే ఓ ఎమోషనల్ మూవీని తెరకెక్కించిన మహేష్‌బాబు.పి ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రీ రిలీజ్ ప్రమోషన్లు బాగా చేశారు. రామ్ పోతినేని రెట్రో లుక్స్ బాగా ఎట్రాక్ట్ చేశాయ్. తన అభిమాన హీరోని పిచ్చి పిచ్చిగా అభిమానించే ప్రతీ అభిమానికి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.. అని ప్రమోషన్స్‌లో పదే పదే చెప్పారు. అలాగే ప్రచార చిత్రాలు కూడా అదే ప్రూవ్ చేశాయ్. ఈ తరహా కాన్సెప్ట్‌లో గతంలోనూ కొన్ని చిత్రాలొచ్చాయ్. మరి, ఈ సినిమా కథ, కథనాలలో ఏమంత కొత్తదనం చూపించి ఆడియన్స్‌ని కన్విన్స్ చేశాడో దర్శకుడు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
ఆంధ్రా కింగ్ అని పిలవబడే హీరో సూర్య కుమార్ (ఉపేంద్ర). హీరోగా సూర్య కుమార్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చుట్టుపక్కల ఓ లంగ గ్రామానికి చెందిన కుర్రాడే సాగర్ (రామ్ పోతినేని). హీరో సూర్య అంటే పిచ్చి అభిమానం. తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. కటౌట్లు కట్టడం, విపరీతంగా ప్రచారాలు చేయడం చేస్తుంటాడు. అలాగే తన అభిమాన హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడానికీ వెనుకాడడు సాగర్. ఈ క్రమంలోనే అదే ఊరిలో ధియేటర్ యాజమాని (మురళీ శర్మ) కూతురు అయిన మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే)ని సాగర్ ప్రేమిస్తాడు. సాగర్ స్థాయి, బ్యాక్ గ్రౌండ్ మహాలక్ష్మి తండ్రికి అస్సలు నచ్చదు. తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తాడు. ఓ హీరోపై తనకున్న పిచ్చి అభిమానాన్ని వెకిలితనం చేసి చిన్న చూపు చూస్తాడు. దాంతో, అదే ఊరిలో పెద్ద ధియేటర్ కట్టి.. తన స్థాయిని పెంచుకుని.. అప్పుడు మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను.. అని శపథం చేస్తాడు సాగర్. మరి, ఆ శపథం నెరవేర్చుకున్నాడా.? ఈ క్రమంలో సాగర్ ఎదుర్కొన్న విపరీతమైన పరిస్థితులేంటీ.? ఈ అభిమాని కష్టం ఆ హీరో సూర్యకి తెలిసిందా.? అసలు హీరోని అభిమాని కలిశాడా.? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
రామ్ పోతినేని యాక్టింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేనికి సరైన హిట్ పడలేదు. ఆ సినిమా కోసం కంప్లీట్ మాస్ మేకోవర్‌లోకి వెళ్లిపోయాడు రామ్. కానీ, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కోసం మళ్లీ తన పాత చాక్లెట్ బోయ్ లుక్స్‌లోకి వచ్చేశాడు. రామ్. చాలా అందంగా క్యూట్‌గా కనిపించాడు. సాగర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. నటనలో ఎన్నో భావోద్వేగాలు చూపించాడు. హండ్రెడ్ పర్సంట్ మార్కులు పడుతున్నాయ్ రామ్ నటనకి ఈ సినిమాలో సాగర్ పాత్రకిగాను. తర్వాత సీనియర్ నటుడు ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. రీల్ లైఫ్ హీరో పాత్ర సూర్యగా ఉపేంద్ర జీవించేశాడు. తనదైన అనుభవాన్ని రంగరించి చూపించాడు. మురళిశర్మకు ఎప్పటిలాగే అలవాటైన పాత్రలో ఒదిగిపోయారాయన. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందంగా కనిపించింది. ఆమె గత చిత్రాలతో పోల్చితే, ఈ సినిమాలో కాస్త బెటర్‌గానే కెమెరా స్కోప్ దక్కిందని చెప్పొచ్చు. తనకిచ్చిన ఇంపార్టెన్స్‌లో బాగా నటించి మెప్పించింది. మిగిలిన పాత్రధారులంతా తమ తమ పరిధి మేర మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో ఈ కథని తెరకెక్కించాడు దర్శకుడు మహేష్ బాబు.పి. ఆ కాలంలోకి ప్రేక్షకుల్ని అలవోకగా తీసుకెళ్లిపోయాడు. టెక్నాలజీ బాగా ఎదిగిన ఈ కాలంలో అభిమాన హీరోల్ని కలుసుకోవడం కాసింత సులువే అని చెప్పొచ్చు. కానీ, ఆ కాలంలో అంత ఈజీ కాదు. తమ అభిమానాన్ని హీరోల వరకూ చేరేలా చేయడం కూడా అంత సాధ్యమైన పని కాదు. అలాంటి టైమ్‌లో ఓ అభిమాని తన హీరో కోసం పడే పాట్లు.. ఎటువంటి ప్రతిపలం ఆశించకుండా.. స్వచ్ఛంగా ఓ హీరోని ఆరాధించే అభిమాని ఎలా వుంటాడో.. ఆ జన్యునిటీని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఫస్టాఫ్ సో సోగా అనిపించినప్పటికీ.. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ప్రేక్షకుడి ఇంటెన్షన్ని క్యారీ చేస్తుంది. కథ పాతదే అయినా కథనాన్ని చాలా ఇంటెన్స్‌గా నడిపించాడు దర్శకుడు. అలాగే, కథనానికి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అలాగే పాటలు కూడా బాగా సెట్ అయ్యాయ్. సినిమాటోగ్రపీ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు రిచ్‌గా వున్నాయ్. సినిమా రన్ టైమ్ విషయంలో రిలీజ్‌కి ముందు కాస్త నెగిటివ్ డిస్కషన్ జరిగినప్పటికీ కథలో ఆ ఫీల్ కనిపించదు. చూస్తున్నంతసేపూ.. అదే ప్రపంచంలోకి ప్రేక్షకుడు వెళ్లిపోతాడు. సో, రన్ టైమ్ పెద్దగా ఫరక్ పడదు. డైలాగ్స్ హత్తుకునేలా వున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగా సెట్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, రామ్ నటన, సెకండాఫ్‌లోని భావోద్వేగాలు..
మైనస్ పాయింట్స్:
కాస్త స్లోగా అనిపించిన ఫస్టాఫ్.. అయినా అదేమంత లెక్కలోకి రాదనుకోండీ.!
చివరిగా:
‘ఆంధ్రా కింగ్ తాలూకా’..రామ్ పోతినేని ఈజ్ బ్యాక్.! రామ్ ఖాతాలో ఫ్రెష్ హిట్ జమ అయిపోయినట్లే. అటు భాగ్యశ్రీ బోర్సే కూడా హిట్టు బోనీ కొట్టేసినట్లే.!
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







