'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- December 01, 2025
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘శ్రేష్ఠ భారత్’ దార్శనికత, సర్దార్ పటేల్ కలలు కన్న ఆదర్శాలకు సంపూర్ణ అనుగుణంగా ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సర్దార్ @150 జాతీయ ఏక్తా యాత్రలో భాగంగా వడోదరలో ఆదివారం ఉదయం వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....2014 నుండి ‘వికసిత్ భారత్’ దిశగా ముందుకు సాగుతున్న నవభారతం, 2025-26 రెండవ త్రైమాసికంలో 8.2% GDP వృద్ధిని సాధించడం, సర్దార్ పటేల్ ఆశించినట్లుగా సంపన్నమైన, సమానత్వ, బలమైన దేశం అనే దార్శనికతకు దర్పణం పడుతోందని ఆయన అన్నారు. గత 11 సంవత్సరాలుగా చేపట్టిన డిజిటల్ ఇండియా, యూపీఐ చెల్లింపులు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఆధార్ ఆధారిత సంక్షేమ పథకాలు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (DBT), ఇ-గవర్నెన్స్ వంటి అనేక విప్లవాత్మక చర్యలు భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చేశాయని నాయుడు పేర్కొన్నారు.
ఆధునిక చరిత్రలో అత్యంత కీలక సమయంలో దేశ ఏకీకరణను పర్యవేక్షించిన భారతదేశపు ‘ఉక్కు మనిషి’కి ఈ ‘ఏక్తా యాత్ర’ అత్యంత సముచితమైన నివాళి అని శ్రీ వెంకయ్య నాయుడు అభివర్ణించారు. నవంబర్ 26న సర్దార్ పటేల్ జన్మస్థలం కరమ్‌సద్‌లో ప్రారంభమై, డిసెంబర్ 6న కేవడియాలోని 182 మీటర్ల ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ముగియనున్న 150 కిలోమీటర్ల ఈ యాత్రలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.
దేశ యువతరం సర్దార్ పటేల్ జీవితాన్ని, త్యాగాలను, దేశానికి ఆయన చేసిన అపారమైన కృషిని తప్పక అధ్యయనం చేయాలని, ఆయన ఆదర్శాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలని వెంకయ్య నాయుడు సూచించారు.ఆయన అచంచలమైన దేశభక్తి, ఆదర్శప్రాయమైన త్యాగాల నుండి ప్రేరణ పొందాలని ఉద్బోధించారు. "రైతుల హక్కుల కోసం బార్డోలీ సత్యాగ్రహంలో పాల్గొనడానికి సంపాదనకు అవకాశం ఉన్న న్యాయవాద వృత్తిని సైతం వదులుకున్నారు, సత్యాగ్రహం వల్లనే ఆయనకు ‘సర్దార్’ అనే బిరుదు లభించింది." అని శ్రీ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.
1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో ఉన్న 565 సంస్థానాలను, తన అద్భుతమైన దార్శనికత, అసాధారణ ధైర్యం, ధృడమైన దేశభక్తి, దౌత్య నైపుణ్యంతో భారత్‌లో విలీనం చేశారన్నారు. 1948లో ‘ఆపరేషన్ పోలో’ రూపంలో సర్దార్ పటేల్ సకాలంలో తీసుకున్న చర్య, హైదరాబాద్‌ను విముక్తి చేసి, భారత యూనియన్‌లో విలీనం చేసిందని, తద్వారా దేశ ప్రాదేశిక సమగ్రత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో పాల ఉత్పత్తిదారులను ఏకం చేసి, 1946లో సహకార సంస్థను ఏర్పాటు చేయడంలో కృషి చేశారని, తద్వారా బహుళజాతి సంస్థ పోల్సన్ గుత్తాధిపత్యాన్ని చేదించారని చెప్పారు. నేటి ‘అమూల్’ అనేది ఆయన దార్శనికతకు గొప్ప ఉదాహరణ అన్నారు.
టిబెట్ పై చైనా ఉద్దేశాల గురించి ఆయన మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను అప్రమత్తం చేశారని, 1962 నాటి చైనా-ఇండియా సంఘర్షణ వినాశకరమైన పరిణామాలను ఆయన ఊహించారని చెప్పారు.
సివిల్ సర్వీసులను "భారతదేశ ఉక్కు చట్రం"గా ఆయన అభివర్ణించి, వాటి రూపకల్పనకు ఆద్యులయ్యారని నాయుడు గుర్తుచేశారు.నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ఆనకట్ట ఆయన ఆశయాన్ని నెరవేర్చిందని, బీడు భూముల్లో నీరు పారి సస్యశ్యామలమైందని వెంకయ్య నాయుడు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







