తిరుమలలో కీలక మార్పులు...

- December 05, 2025 , by Maagulf
తిరుమలలో కీలక మార్పులు...

తిరుమల: తిరుమలలోని పలు వీధులకు శ్రీవారి(TTD) పరమ భక్తుల పేర్లు ఇవ్వాలని టీటీడీ(TTD)నిర్ణయించింది.ఈ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది.ఇప్పటి వరకు మేదరమిట్ట, ఆర్‌బీ సెంటర్, ముళ్లగుంట వంటి భౌతిక ఆధారిత పేర్లు ఉండగా—ఇవి ఆధ్యాత్మికతకు అనుగుణంగా లేవన్న విమర్శల నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టారు.

అందుకు అనుగుణంగా వీధులకు శ్రీ అన్నమయ్య, తిరుమలనంబి, వెంగమాంబ, పురందరదాసు, అనంతాళ్వార్, సామవాయి వంటి మహనీయ భక్తుల పేర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో దీనిపై టీటీడీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

గెస్ట్‌హౌస్‌లకు కొత్త ఆధ్యాత్మిక పేర్లు...

తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీ స్వాధీనం చేసుకున్న 42 విశ్రాంతి భవనాల పేర్లను కూడా మార్చారు.ఇక పై ప్రతి గెస్ట్ హౌస్‌కు భగవంతుడిని సూచించే పేర్లు మాత్రమే వినియోగించాలని బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

కొన్ని కొత్త పేర్లు:

  • జిఎంఆర్ విశ్రాంతి భవనం → ఆనంద నికేతనం
  • మాగుంట నిలయం → రాఘవ నిలయం
  • మైహోమ్ పద్మప్రియ → పద్మప్రియ నిలయం
  • సుధాకృష్ణ నిలయం → వైకుంఠ నిలయం
  • పాండవ విశ్రాంతి భవనం → విరజా నిలయం

ఇక పై తిరుమలలో నిర్మాణం అయ్యే ఏ కార్యాలయం, నివాస గృహం, గెస్ట్ హౌస్ అయినా దైవనామమే ఉండాలని టీటీడీ నిర్ణయించింది.

డిసెంబర్–జనవరిలో విఐపీ దర్శనాలపై పరిమితులు
పర్వదినాల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విఐపీ బ్రేక్ దర్శనాలకు పరిమితి విధించింది.

  • డిసెంబర్ 29, 30 నుంచి జనవరి 8 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత
  • జనవరి 25 – రథసప్తమి: ప్రోటోకాల్ తప్ప ఇతరులకు బ్రేక్ దర్శనం నిలిపివేత
  • ఈ రోజుల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల
జనవరి 2 నుంచి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఆన్‌లైన్ టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేయనుంది.

టికెట్ వివరాలు:

శ్రీవాణి కోట టికెట్లు:

  • ఉదయం 10 గంటలకు రోజుకు 1000 చొప్పున విడుదల

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు:

  • మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15,000 చొప్పున రిలీజ్
  • తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా కేటాయింపు పూర్తైంది.

భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com