తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త

- December 19, 2025 , by Maagulf
తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త

తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు కొనసాగనున్నాయి. ఈ కాలంలో లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ(TTD) అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా భద్రత, దర్శన క్రమాలు, వసతి ఏర్పాట్ల పై ప్రత్యేక దృష్టి సారించింది. తొలి మూడు రోజుల దర్శనాల కోసం ఇప్పటికే 1,76,000 మందిని ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఎంపిక చేశారు.

వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి అదనపు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో బెంగళూరు–తిరుమల మధ్య నడుస్తున్న సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుతం తిరుమల–బెంగళూరు మధ్య మొత్తం 13 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవన్నీ అలిపిరి డిపో ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. తిరుమల నుంచి బయలుదేరే ఈ బస్సులు తిరుపతి, చిత్తూరు మీదుగా బెంగళూరుకు చేరుకుంటాయి. భక్తులు తమ ప్రయాణానికి సంబంధించిన టికెట్లను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

తిరుమల నుంచి బెంగళూరుకు తెల్లవారు జామున, ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులో ఉండగా, బెంగళూరు నుంచి తిరుమలకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు విభిన్న సమయాల్లో బస్సులు నడుస్తున్నాయి. దీని ద్వారా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలన్నదే ఆర్టీసీ లక్ష్యంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com