ఎంసెట్‌-2 పరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

- July 29, 2016 , by Maagulf
ఎంసెట్‌-2 పరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్‌-2 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను రద్దు చేసి ఎంసెట్‌-3 నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీ అందించిన నివేదికపై కేసీఆర్‌ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ, పలువురు మంత్రులు, అధికారులతో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండాలంటే ఎంసెట్‌-2ను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. లీకేజీ కారకులను, దాని ద్వారా లబ్ధి పొందిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎంసెట్‌-2 పరీక్ష లీకేజీ కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న సీఐడీ రోజుల వ్యవధిలోనే విలువైన సమాచారాన్ని సేకరించింది. ప్రశ్నాపత్రం లీకేజీ నిజమేనని.. దీనివల్ల సుమారు 100 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందినట్లు గుర్తించింది. రూ.15కోట్లు వరకు డీల్‌ కుదిరినట్లు నిర్ధారించింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐడీ.. వారిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసు పురోగతికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేసింది. దీనిపై సమీక్షించిన సీఎం.. పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com