భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ

- February 08, 2026 , by Maagulf
భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ

తిరువనంతపురం: ఆరోగ్య సంరక్షణ రంగంలో కేరళ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. కోజికోడ్‌లోని చెవయూర్‌లో దేశంలోనే మొట్టమొదటి సమగ్ర అవయవ మార్పిడి సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ ప్రపంచంలోనే మూడవ సమీకృత చికిత్స పరిశోధనా కేంద్రం కూడా. అలాగే దేశంలోనే ఈ తరహాలో మొదటిది.

కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి సంస్థ (KIIFB) నిధులతో సుమారు రూ.643.88 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అవయవ మార్పిడికి సంబంధించిన అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్‌ (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఈ సంస్థ ప్రాథమిక నిర్ధారణ, అధునాతన శస్త్రచికిత్సల నుంచి పోస్ట్‌-ట్రాన్స్‌ప్లాంట్‌ ఫాలో-అప్‌ , పునరావాసం వరకు పూర్తి స్థాయి సంరక్షణను అందించనున్నది. క్లినికల్‌ సేవలతో పాటు, అవయవ మార్పిడి రంగంలో పరిశోధన, బోధన, వైద్య నిపుణుల శిక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నది. ప్రయివేట్‌ రంగంలో లక్షల రూపాయలు ఖర్చయ్యే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను సాధారణ ప్రజలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్‌ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. చెవయూర్‌లోని 20ఎకరాల స్థలంలో ఈ సంస్థ నిర్మాణం ప్రారంభమైంది. 30 నెలల్లో ఈ సదుపాయాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, అవయవ మార్పిడి ప్రక్రియల కోసం ప్రయివేట్‌ ఆస్పత్రులు , విదేశాలపై కేరళ ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గించనున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పంపిణీలో ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com