భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- February 09, 2026
కౌలాలంపూర్: ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ సందేశం చాలా స్పష్టమైందని, ద్వంద్వ ప్రమాణాలకు తావు ఇచ్చేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఎలాంటి రాజీ లేకుండా ఉగ్రవాదంపై పోరాడుతామని ఆయన తేల్చి చెప్పారు.ఇందు కోసం భారత్, మలేషియాలు నిఘా వర్గాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. ఇరుదేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకూ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రెండు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ, ఆదివారం ఉదయం పుత్రజయ నగరం వేదికగా ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం అన్వర్ ఇబ్రహీం, నరేంద్ర మోదీ కలిసి సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మోదీ ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.
‘ఇండో-పసిఫిక్ ప్రాంతం అనేది ఇప్పుడు ప్రపంచ వికాసానికి ఒక ఇంజిన్‌లా మారింది. మేం ఆసియాన్ కూటమి దేశాలు సహా యావత్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను కోరుకుంటున్నాం. మలేసియా లాంటి మిత్రదేశాల సహకారంతో రాబోయే రోజుల్లో ఆసియాన్ (ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్) కూటమితో భారత్ బంధాన్ని బలోపేతం చేసుకుంటుంది. ఆసియాన్ – ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష త్వరగా పూర్తి కావాలనే వాదనతో మేం ఏకీభవిస్తున్నాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేను, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు అర్థవంతమైన చర్చలు జరిపాం’ అని ప్రధాని మోదీ తెలిపారు. ‘భారత్, మలేసియాల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సముద్ర జల మార్గాల పరంగా చూస్తే భారత్, మలేసియాలు ఇరుగుపొరుగు దేశాలు. భారత సంతతి ప్రజలు భారీసంఖ్యలో నివసిస్తున్న దేశాల జాబితాలో రెండో స్థానంలో మలేసియా ఉంది. ఇరుదేశాల నాగరికతలు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామిక విలువలతో అనుసంధానం అయ్యాయి. గత కొన్నేళ్ల వ్యవధిలో భారత్, మలేసియాల సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఇందుకోసం నా మిత్రుడు, మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు ధన్యవాదాలు చెబుతున్నా’ అని ప్రధాని మోదీ అన్నారు.
ఇంధన, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారం బలోపేతమైందని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్ ఎకానమీ, బయోటెక్, ఐటీ విభాగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. మలేసియా, భారత్ ప్రజల మధ్య సంబంధాలు సైతం మరింత మెరుగయ్యాయని, ఫలితంగా ఇరుదేశాల్లో పర్యాటక రంగానికి ఊతం లభించిందని పేర్కొన్నారు. ఈ విజయాల స్ఫూర్తితో మలేసియా, భారత్ భాగస్వామ్యాన్ని మునుపెన్నడూ లేనంత వేగంతో బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్‌లో భారత్‌కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









