నూతన ఏకరూప దుస్తులు రైల్వే సిబ్బందికి ..

- July 31, 2016 , by Maagulf
నూతన ఏకరూప దుస్తులు రైల్వే సిబ్బందికి ..

ప్రయాణికులతో ప్రత్యక్ష సంబంధాలుంటే రైల్వే సిబ్బందికి నూతన ఏకరూప దుస్తులు త్వరలో రానున్నాయి. టికెట్ల జారీ సిబ్బంది, టీటీఈలు, గార్డులు, డ్రైవర్లు (లోకో పైలట్లు), స్టేషన్‌ మాస్టర్లు, ఆహార పదార్థాలు సరఫరా చేసే సిబ్బంది... ఇలా తొలి విడతగా 5 లక్షల మంది ఒకే విధమైన దుస్తుల్లో కనిపించనున్నారు. దీనికి రూ.50 కోట్లు ఖర్చు కానుంది. ప్రముఖ వస్త్రశ్రేణి రూపకర్త రీతూబెరి సిద్ధం చేసిన నాలుగు రకాల నుంచి ఒకదానిని ఎంపిక చేయనున్నారు. చీరలు, టీ-షర్టులూ వీటిలో ఉన్నాయి. తుది ఎంపికలో ప్రజాభిప్రాయాన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా, రైల్వే వెబ్‌సైట్‌ ద్వారా సేకరించనున్నారు. తాను రూపొందించిన నమూనాలు విలక్షణంగా, భారత్‌ భావగీతాన్ని చాటేలా సౌఖ్యంగా, ఆధునికంగా ఉంటాయని రీతూ బెరి తెలిపారు. పురాతన సంస్కృతి-సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక భారతాన్ని ప్రతిబింబించేలా ఇవి కనిపిస్తాయని చెప్పారు. గిరిజన కళ, స్వర్ణయుగం నాటి కరెన్సీ, నవాబుల వారసత్వం, పాప్‌ కళ... ఇలా నాలుగు భిన్న నేపథ్యాలతో వస్త్రాలు రూపొందాయని తెలిపారు.
రోజుకు రెండు కోట్ల మందికి పైగా ప్రజలకు సేవ చేస్తున్న రైల్వేలో పనిచేస్తున్నందుకు గర్వపడేలా, అంకితభావంతో ఉండేలా ఏకరూప దుస్తులు ఉపయోగపడతాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మరమ్మతు కేంద్రాలు, ఉత్పాదక విభాగాల్లోని సిబ్బందికీ వీటిని ఇస్తారు. ఈ ఏడాది చివరి నాటికివి సిద్ధమవుతాయి. చాలా ఏళ్ల క్రితం రూపకల్పన చేసిన ఏకరూప దుస్తుల్ని ప్రస్తుతం టీటీఈలు, స్టేషన్‌మాస్టర్లు, గార్డులు ధరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com