ఈఓడీబీ ర్యాంకులలో తెలంగాణ ప్రథమo ఆంధ్రారెండోస్థానంలో !

- July 31, 2016 , by Maagulf
ఈఓడీబీ ర్యాంకులలో తెలంగాణ ప్రథమo ఆంధ్రారెండోస్థానంలో !

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకులలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఈఓడీబీ ప్రాథమిక ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించింది. 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల చేసిన 2015 ర్యాంకులలో ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. అయితే 2016 జూన్ లో వెలువడిన ప్రాథమిక ఫలితాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానానికి పడిపోయింది. దాంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ తర్వాతే తాము సైట్ లో పెట్టిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ చేసిందంటూ తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొట్లాటకు దారితీసింది. అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం)' ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని 'డిప్' బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పేరిట ఓ వెబ్ పోర్టల్ రూపొందించింది. ఈవోడీబీ ర్యాంకును ఆశించే రాష్ట్రాలు డిప్ సూచించిన 340 ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో సమాధానాలను సమర్పించాలి. ఆయా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం, సమాధానాల పురోగతిని పర్యవేక్షించేందుకు 'ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డు'ను ఏర్పాటు చేశారు.రాష్ట్రాలు శాఖలవారీగా సమర్పించే సమాచారం ఆధారంగా 'స్కోరు'ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాలు జూన్ 30లోగా సులభ వాణిజ్యానికి వీలు కల్పించేలా తాము చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను సమర్పించాలని డిప్ గడువు విధించింది. జూన్ 28, 29 తేదీల్లో వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆధారాల సమర్పణ గడువును జూలై ఏడో తేదీ వరకు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com