సౌదీలో చిక్కుకున్న భారతీయులను తీసుకొస్తాం: సుష్మా

- August 01, 2016 , by Maagulf
సౌదీలో చిక్కుకున్న భారతీయులను తీసుకొస్తాం: సుష్మా

దిల్లీ: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 10 వేలమంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. ఐదు శిబిరాలు నిర్వహిస్తూ బాధితులకు ఆశ్రయమిస్తున్నామని... ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతీయ కార్మికుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకుగాను విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ సౌదీ వెళ్లనున్నట్లు పునరుద్ఘాటించారు. సౌదీలో ఆకలితో అలమటిస్తున్న భారతీయుల భవిష్యత్తుపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో... ఉభయ సభల్లో సుష్మ సోమవారం ఓ ప్రకటన ద్వారా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
కార్మికుల ఆకలి తీర్చడానికి సౌదీలో మనదేశ దౌత్య కార్యాలయం ఐదు శిబిరాలను నిర్వహిస్తోందని... 10 రోజులకు సరిపడా రేషన్‌ను బాధితులకు పంచిపెట్టామని సుష్మ తెలిపారు. అక్కడి పరిస్థితులపై గంటగంటకూ తాను వివరాలు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన తరలింపు ప్రక్రియ చేపట్టేందుకుగాను సౌదీ అధికారవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. యజమానుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం లేకుండా ఉద్యోగులను తరలించడానికి సౌదీలో చట్టాలు అనుమతించవని సూచించారు. యజమానులు తమ సంస్థలను మూసివేసి దేశం విడిచి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వివరించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సౌదీ ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. యజమానులు దేశం విడిచి వెళ్లినందువల్ల కార్మికులకు తిరుగుప్రయాణ వీసాలు అందజేయాలనీ కోరినట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com