భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో తల్హా సయూద్ కలకలం

- August 03, 2016 , by Maagulf
భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో తల్హా సయూద్ కలకలం

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ తనయుడు తల్హా సయూద్.. భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో కలకలం సృష్టించాడు. భారీ ట్రక్కుల నిండా ఆహార పదార్థాలు, వైద్య సామాగ్రిని తీసుకొచ్చి.. వాటిని కశ్మీర్ కు పంపాలని, అప్పటివరకు తాను కదలబోనని చికోటిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ రేఖ) చెక్ పాయింట్ వద్ద బైఠాయించాడు. తండ్రిలాగే ఇస్లామిక్ ప్రొఫెసర్ అయిన తల్హా సయీద్.. జమాత్ ఉల్ దవా సోదర సంస్థ ఫలె-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 10 ట్రక్కుల్లో పెద్ద ఎత్తున సామాగ్రిని నింపుకొని మంగళవారం సాయంత్రం చికోటి వద్దకు చేరుకున్న తల్హా.. అనుచరులతో కలిసి భారత్ లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశాడు. పాక్ భద్రతాబలగాలు, పోలీసులు అడ్డుకోవడంతో చికోటిలోనే బైఠాయింపునకు దిగాడు. బుధవారం కూడా వారి నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సార్క్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారమే పాకిస్థాన్ కు వెళ్లనున్నారు. ఆయను పాక్ లో అడుగుపెట్టనివ్వబోమని ఉగ్రసంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు భారత్ బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల్లో దాదాపు 50 మంది పౌరులు చనిపోవడం, 2,500 మంది గాయపడటం తెలిసిందే. భారత్ లో జరుగుతున్న ఆందోళనలను అనుకూలంగా తీసుకుని, కశ్మీర్ కు వైద్య బృందాన్ని జమాత్ ఉల్ దవా ప్రయత్నించింది. వారికి భారత్ వీసా నిరాకరించడంతో.. ఇప్పుడు హఫీజ్ కొడుకు తల్హా రంగంలోకిదిగాడు. సోదర కశ్మీరీలకు చేరేలా వైద్య సామాగ్రిని భారత్ లోకి పంపేవరకు చకోటీలోనే బైఠాయిస్తానని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్హా చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com