ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్‌ జలాల్లోకి బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయోగం..

- August 03, 2016 , by Maagulf
ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్‌ జలాల్లోకి బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయోగం..

ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్‌ జలాల్లోకి ఖండాంతర క్షిపణి (బాలిస్టిక్‌ మిస్సైల్‌)ని ప్రయోగించింది. నేరుగా జపాన్‌ నియంత్రణలోని జలాల్లోకి క్షిపణి ప్రయోగించడంతో జపాన్‌ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా చర్యలతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు.. ఉత్తరకొరియాకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉ.కొరియా రెండు ఇంటర్మీడియట్‌ రేంజ్‌ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించింది. అయితే అందులో ఒకటి టేకాఫ్‌ సమయంలోనే పేలిపోయినట్లు తెలిసిందని అమెరికా సైన్యం వెల్లడించింది.
దక్షిణ కొరియాలో అమెరికా క్షిపణి వ్యతిరేక సిస్టమ్‌ ఏర్పాటు చేసి.. అమెరికా, ద.కొరియా సైన్యాలు సంయుక్తంగా మిలిటరీ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉ.కొరియా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో పడిందని.. జపాన్‌ ఉత్తర తీరానికి 250కిలోమీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోందని జపాన్‌ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్రంగా ఆటంకం కలిగించే అంశమని జపాన్‌ ప్రధాని షింజో అబే ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. ఉ.కొరియా చర్యలను అమెరికా ఖండించింది. బాలిస్టిక్‌ క్షిపణి టెక్నాలజీ ఉపయోగిస్తూ ఐరాస భద్రతా మండలి నిబంధనలను ఆ దేశం పూర్తిగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com