ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం

- March 25, 2026 , by Maagulf
ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం

ప్రపంచ కథా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 20న “ఊ కొడతారా” పేరుతో నిర్వహించిన బుజ్జాయిల కథా కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. తెలుగుతల్లి కెనడా, బీ పాజిటివ్, గడుగ్గాయి, తెలుగువాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 220 మంది చిన్నారులు పాల్గొన్నారు.

ఈ కథా మహోత్సవం 20 గంటల పాటు నిరంతరంగా సాగి, చిన్నారుల ప్రతిభను వెలికితీసే వేదికగా నిలిచింది. చిన్నపిల్లలు చెప్పిన కథలు శ్రోతలను అలరించడంతో పాటు కథల ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆకాశవాణి విశ్రాంత ప్రయోక్త మడిపల్లి దక్షిణామూర్తి హాజరై చిన్నారులకు కథల విలువను వివరించి, స్ఫూర్తిదాయక సందేశాలు అందజేశారు.

ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తెలుగుతల్లి కెనడా కమిటీ సభ్యులు, కెనడాలోని వాలంటీర్లు నెలరోజులకు పైగా శ్రమించారు. అలాగే పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు కథలు చెప్పడంలో ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహించారు. పిల్లలను కథల వైపు మళ్లించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రాయవరం,లావణ్య బాలాంత్రపు,రత్నమాధవి రాయవరపు, డా.ఉదయశ్రీ చదలవాడ, విమలాప్రసాద్ గుర్రాల,ఝాన్సిలక్ష్మి గరిమెళ్ళ,సమత రాచమళ్ళ, జ్యోతి రాచ, సౌమ్య లింగారెడ్డి,లక్ష్మి రాయవరపు,సత్య పోతంశెట్టి తదితరులు పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, కథా సంప్రదాయాన్ని విస్తరింపజేసే ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com